Virat Kohli | ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా బెంగళూరులో బుధవారం జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటనతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చిక్కుల్లో పడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కోహ్లీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్ఎమ్ వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పోలీసు స్టేషన్ (Cubbon Park Police Station)లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టరైన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 18 ఏండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడింది. ఈ సందర్భంగా బుధవారం బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 47 మందికిపైగా గాయపడ్డారు.
ట్రెండింగ్‌లో #ArrestKohli హ్యాష్‌ట్యాగ్..
ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ, కర్ణాకట క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఘటన నేపథ్యంలో ఆర్సీబీ జట్టు స్టార్ ఆటగాడైన విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తొక్కిసలాటకు భాద్యుడిగా కోహ్లీని అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు #ArrestKohliని నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
పుష్ప-2 స్క్రీనింగ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. థియేటర్‌కు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, పోలీసులు వద్దని వారించినా ఆయన కారులో పరేడ్ నిర్వహించారని ఆరోపిస్తూ ఆ హీరోను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. మరి, తమ హీరోను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టే, ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కోహ్లీని కూడా అరెస్ట్ చేస్తుందా..? అని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో #ArrestKohli ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Also Read..
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట.. కేఎస్‌సీఏ సెక్రటరీ, ట్రెజరర్ రాజీనామా
పోలీసులను బలి పశువుల్ని చేస్తారా?
Bangalore Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీపై వేటు