Bengaluru Stampede | ఆర్సీబీ (RCB) విజయోత్సవ వేడుక సందర్భంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 47 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (Karnataka State Cricket Association)పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్సీఏ సెక్రటరీ, ట్రెజరర్ తమ పదవులకు రాజీనామా చేశారు.
క్రికెట్ సంఘం కార్యదర్శి ఏ శంకర్, ట్రెజరర్ ఇ.జైరాం రాజీనామా సమర్పించారు. శుక్రవారం రాత్రి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి తమ రాజీనామా పత్రాలకు పంపినట్లు వారు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గత రెండు రోజులుగా జరిగిన ఊహించని, దురదృష్టకర సంఘటనల కారణంగా మా పాత్ర చాలా పరిమితం అయినప్పటికీ.. నైతిక బాధ్యతగా రాజీనామా చేశాం. నిన్న కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపాము’ అని వారు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ, కర్ణాకట క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association), ఈవెంట్ మేనేజర్లపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్సీఏ) ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సంస్థ అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి ఎ శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరాం నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని అర్జీలో కోరారు. దీనిపై నిన్న మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు.. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులు, ప్రభుత్వానికి సూచించింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు సహకరించాలని, న్యాయస్థానం పరిధి దాటి ఎక్కడకు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని అర్జీదారులకు న్యాయస్థానం సూచించింది.
Also Read..
Karnataka cricket body | తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ సంఘం
పోలీసులను బలి పశువుల్ని చేస్తారా?
Corona Virus | 24 గంటల్లో 391 కొత్త కేసులు.. నాలుగు మరణాలు