బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవ వేడుక సందర్భంగా గత బుధవారం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ దయానంద్ సహా అయిదుగురు అధికారులను సర్కారు బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు పోలీసులను బలి పశువులను చేస్తారా అని పలువురు విశ్రాంత పోలీస్ అధికారులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి కారణం పెద్ద వ్యక్తులు. తప్పులు జరగొచ్చు. కానీ దానికి సస్పెండ్ల రూపంలో ప్రతిస్పందన ఉండకూడదని నగర మాజీ పోలీస్ కమిషనర్ మేఘారిక్ వ్యాఖ్యానించారు. ‘ఈ మరణాలకు నియంత్రణ లేని డిప్యూటీ సీఎం శివకుమారే కారణమని..’ విశ్రాంత ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు తీవ్రంగా విమర్శించారు. తొక్కిసలాటకు కారణమైన శివకుమార్, సిద్ధరామయ్య పోలీసులను ముందుకు నెట్టి తప్పించుకుంటున్నారని.. వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్ర అదనపు డీజీపీ(ఇంటెలిజెన్స్) హేమంత్ నింబాళ్కర్ను ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. అలాగే ఎమ్మెల్సీ గోవిందరాజ్ను సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి పదవి నుంచి వెంటనే తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నలుగురు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారులను, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఆర్సీబీ మార్కెటింగ్, రెవెన్యూ విభాగాధిపతి నిఖిల్ సోసలె ఉన్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శులపై చర్యలొద్దంటూ కర్ణాటక హైకోర్టుఉత్తర్వులు జారీ చేసింది.