Bangalore Stampede | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట (Bangalore Stampede)లో 11 మంది మృతిచెందడం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సిద్ధరామయ్య ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్‌తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) పొలిటికల్ సెక్రటరీ కె.గోవిందరాజ్ (K Govindaraj)పై ప్రభుత్వం వేటు వేసింది (Political Secretary Removed). ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
K. Govindaraj relieved from the post of Political Secretary to the Karnataka Chief Minister Siddaramaiah with immediate effect, as per a state government notification.
— ANI (@ANI) June 6, 2025
తొక్కిసలాటకు ముందు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో పోలీసు కమిషనర్‌పై గోవిందరాజ్ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. విక్టరీ పరేడ్, విధాన సౌధ, చిన్న స్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్‌కు అనుమతి ఇవ్వలేమని పోలీస్ కమిషనర్ చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదని సమాచారం. ఆయన ఒత్తిడితోనే విధాన సౌధ, చిన్న స్వామి స్టేడియంలో విక్టరీ సెలబ్రేషన్స్‌కు అనుమతి వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగానే ఆయనపై అధికారులు వేటు వేసినట్లుగా జాతీయ మీడియా పేర్కొంటోంది. మరోవైపు కర్ణాటక ఇంటెలిజెన్స్ చీఫ్ (Karnataka Intel Head Transferred) హేమంత్ నింబాల్కర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
పోలీసులు వద్దన్నా.. సర్కారు ముందుకే
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కప్ గెలిచిన మరుసటి రోజే ఈవెంట్ నిర్వహణ వద్దని, భద్రత, లాజిస్టిక్ సమస్యలు తలెత్తుతాయని బెంగళూరు పోలీసులు ప్రభుత్వానికి ముందే సూచించారు. ఆదివారం వేడుకను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసుల విజ్ఞప్తిని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఈవెంట్ నిర్వహణకే మొగ్గుచూపింది. తక్కువ సమయం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయలేక, వచ్చిన రద్దీని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని వివరించింది. మరోవైపు, ఫైనల్ జరగడానికి ముందే ఈవెంట్ నిర్వహణ కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్టు ఓ లేఖ తాజాగా బయటకు వచ్చింది. చివరి నిమిషంలో స్టేడియంలో వేడుకకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కూడా ప్రమాదానికి కారణమైనట్టు సమాచారం.
Also Read..
Karnataka cricket body | తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ సంఘం
Bangalore Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సిటీ కమిషనర్, నలుగురు పోలీసు అధికారులపై వేటు