బెంగళూరు: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై (Bangalore Stampede) కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాలకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారించినా పట్టించుకోని ప్రభుత్వం చివరికి వారినే బలిపశువులను చేసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మరణించగా మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్‌తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.
వారిలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) వికాస్ కుమార్ వికాస్, సెంట్రల్ డిసిపి టి.శేఖర్, కబ్బన్ పార్క్ ఏసీపీ బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పోలీస్ ఇన్స్పెక్టర్ గిరీష్ ఉన్నారు. వీరితోపాటు చిన్నస్వామి స్టేడియం ఇన్చార్జిని కూడా విధుల నుంచి తప్పించింది. ఆర్సీబీ ప్రతినిధులను, డీఎన్ఏ ఈవెంట్ మేనేజర్లు, కేఎస్‌సీఏ సభ్యులను అరెస్టు చేయాలని సీఎం సిద్దరామయ్య రాష్ట్ర డీజీపీ, ఐజీపీలను ఆదేశించారు. విషాద ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. అదేవిధంగా న్యాయ విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ఘటన జరిగిన విధానం, జారీ చేసిన భద్రతా ఏర్పాట్లలో వైఫల్యం, ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ జరుగనుంది.
పోలీసులు వద్దన్నా.. సర్కారు ముందుకే
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కప్ గెలిచిన మరుసటి రోజే ఈవెంట్ నిర్వహణ వద్దని, భద్రత, లాజిస్టిక్ సమస్యలు తలెత్తుతాయని బెంగళూరు పోలీసులు ప్రభుత్వానికి ముందే సూచించారు. ఆదివారం వేడుకను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసుల విజ్ఞప్తిని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఈవెంట్ నిర్వహణకే మొగ్గుచూపింది. తక్కువ సమయం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయలేక, వచ్చిన రద్దీని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని వివరించింది. మరోవైపు, ఫైనల్ జరగడానికి ముందే ఈవెంట్ నిర్వహణ కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్టు ఓ లేఖ తాజాగా బయటకు వచ్చింది. చివరి నిమిషంలో స్టేడియంలో వేడుకకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కూడా ప్రమాదానికి కారణమైనట్టు సమాచారం.
కోర్టుకు తప్పుడు లెక్కలు
తొక్కిసలాట ఘటనను సుమోటోగా తీసుకొన్న కర్ణాటక హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ దుర్ఘటనను ఆపలేకపోయారా? అని ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కాగా ఘటన సమయంలో వెయ్యి మంది పోలీసులే ఉన్నారని కోర్టులో ప్రభుత్వం చెప్పగా, 5 వేల మంది పోలీసులు ఉన్నారని బుధవారం డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పడం గమనార్హం. దీంతో కోర్టుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పిందని నెటిజన్లు మండిపడుతున్నారు. తొక్కిసలాటకు సంబంధించి నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ఆర్సీబీ, కేఎస్‌సీఏపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు గురువారం బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.