Ben Stokes : భారత పర్యటనకు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్న స్టోక్స్ త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో ఆల్కహాల్ మానేశాడు. జూన్‌లో స్వదేశంలో జరుగబోయే ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు సన్నద్దమవుతున్న అతడు కొన్నిరోజులు తనకిష్టమైన బీర్లు, వైన్ వంటివి ముట్టుకోనని ప్రతిన చేశాడు.
గత ఏడాది నుంచి తరచూ గాయాలపాలవుతున్నాడు స్టోక్స్. నిరుడు డిసెంబర్లో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ఆడుతుండగా తొడకండరాల గాయంతో ఇబ్బందిపడిన అతడు సర్జరీ చేయించుకున్నాడు. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. జూన్‌లో టీమిండియా(Team India)తో స్వదేశంలో ఐదు టెస్టు సిరీస్ ఉన్నందున అప్పటికల్లా ఫిట్నెస్ సాధించాలని అనుకుంటున్నాడు. ఇంతకుముందులానే ఆల్‌రౌండర్‌గా రాణించాలని భావిస్తున్న స్టోక్స్.. ఆల్కహాల్ మానేశాడు. త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతోనే అతడీ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యులు తెలిపారు.
‘నాకు మొదట గాయం అయినప్పుడు షాక్‌లో ఉండిపోయాను. అప్పుడు వరుసగా నాలుగైదు రోజుల ఆల్కహాల్ తీసుకున్నా. అందువల్లనే గాయం తీవ్రత పెరిగిందని అనిపించింది. సో.. అప్పట్నుంచి మందుకు దూరంగా ఉండాలనుకున్నా. జనవరి నుంచి ఆల్కహాల్ తీసుకోవడం లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకూ మందు ముట్టకూడదని షరతు పెట్టుకున్నా’ అని స్టోక్స తెలిపాడు.
English cricketer Ben Stokes quits alcohol to stay fit during his ongoing hamstring injury rehabilitation ahead of test series against India and Ashes.#BenStokes pic.twitter.com/imUaVxTWqQ
— CricFollow (@CricFollow56) May 19, 2025
ఇంగ్లండ్ జట్టు తరఫున విజయవంతమైన టెస్టు కెప్టెన్లలో స్టోక్స్ ముందువరుసలో ఉంటాడు. బ్రెండన్ మెక్కల్లమ్ హెడ్‌కోచ్ అయ్యాక.. స్టోక్స్ సైతం దూకుడుగా మారిపోయాడు. వీళ్లిద్దరి ఆధ్వర్యంలో ‘బజ్‌బాల్’ ఆటతో ఇంగ్లండ్ రెచ్చిపోయింది. 2023-24లో వరుస విజయాలతో ప్రత్యర్థులను వణికించింది. అయితే.. భారత పర్యటనలో మాత్రం స్టోక్స్ సేనకు ఘోరపరాభవం ఎదురైంది. రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ ఓటమికి బదులు తీర్చుకునేందుకు ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. జూన్‌లో ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ షురూ కానుంది.