ఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు తరలించాలన్న విజ్ఞప్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తిరస్కరించిందట. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో పాటు ఐసీసీ సైతం బీసీసీఐని కోరినా దానిపై విముఖత చూపినట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మహిళల టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలని బీసీబీతో పాటు ఐసీసీ నుంచి ప్రతిపాదన వచ్చింది. కానీ మేం దానిని తిరస్కరించాం. వరల్డ్‌కప్ షెడ్యూల్ సమయానికి భారత్‌లో ఇంకా వర్షాకాలమే ఉంటుంది. అదీగాక వచ్చే ఏడాది మేం మహిళల వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించాల్సి ఉంది.
వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లను వరుస ఏడాదుల్లో నిర్వహించడం కష్టం’ అని షా చెప్పాడు. భారత్‌లో డే అండ్ నైట్ టెస్టులు వర్కవుట్ కాబోవని షా స్పష్టం చేశాడు. ఈ టెస్టులు రెండు రోజుల్లోనే ముగుస్తుండటంతో దీనివల్ల ప్రేక్షకులు, ప్రసారదారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని తెలిపాడు. ఇది భావోద్వేగంతో కూడుకున్న వ్యవహారమని అన్నాడు.
2022 తర్వాత భారత్ స్వదేశంలో ‘గులాబీ టెస్టు’ ఆడలేదు. టెస్టు క్రికెట్ మనుగడ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆ క్రమంలో టెస్టుల కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు షా తెలిపాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి సమాంతరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ఎన్సీఏ నిర్మాణం జరుగుతోందని ఇందులో క్రికెటర్లతో పాటు నీరజ్ చోప్రా వంటి అథ్లెట్లు సైతం ప్రాక్టీస్ చేసుకునే విధంగా వసతులు అందుబాటులో ఉంటాయని షా తెలిపాడు.