BCCI A; ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’ (Impact Player) నిబంధన ఎంత హిట్ అయిందో చూశాం. మ్యాచ్ మధ్యలో ఎప్పుడైనా ఓ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకునేందుకు వీలుండే ఈ నియమంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంప్యాక్ట్ రూల్‌తో ఆల్రౌండర్లకు తీరని నష్టం జరుగుతుందని పలువురు క్రికెటర్లు వాపోయారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
తొలిసారి ప్రయోగాత్మకంగా సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali) ట్రోఫీలో ఇంప్యాక్ట్ నియమాన్ని ప్రవేశపెట్టిన బీసీసీఐ ఇప్పుడు ఆ లీగ్‌తోనే ఈ కొత్త ఒరవడికి ఫుల్స్టాప్ పెట్టింది. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనను పాటించొద్దని నిర్వాహకులకు బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల బోర్డులకు తెలియజేసింది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ ట్రోఫీలో 2023లో బీసీసీఐ ఇంప్యాక్ట్ నియమాన్ని తీసుకొచ్చింది.
ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనతో బీసీసీఐ ఐపీఎల్ జోష్‌ను మరింత పెంచింది. 2023లో ఈ నియమాన్ని తీసుకొచ్చి టోర్నీకి మరింత వన్నె తెచ్చింది. అందుకని కొందరు విమర్శిస్తున్నా సరే.. ఈ నియమంపై బీసీసీఐ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా 18వ సీజన్‌కు ఇంప్యాక్ట్ను కొనసాగిస్తూ జనరల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో ఇంప్యాక్ట్ రూల్‌ను యథావిధంగానే కొనసాగిస్తామని, 2027 ఎడిషన్ వరకూ ఈ నిబంధన ఐపీఎల్లో ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది.