IPL 2025 : పొట్టి ఫార్మాట్‌కు పిచ్చి క్రేజ్ తెచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లే కాదు మెగా వేలంపై కూడా అభిమానుల్లో ఎనలేని ఆసక్తి ఉంటుంది. అందుకని ప్రతిమూడేండ్లకు ఓసారి జరిగే మెగా వేలం కోసం ఫ్రాంచైజీలే కాదు ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. సో.. ఇప్పుడు అందరి కళ్లన్నీ18వ సీజన్‌కు ముందు నిర్వహించనున్న మెగా ఆక్షన్ మీదనే ఉన్నాయి. ముఖ్యంగా రిటెన్షన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏం నిర్ణయం తీసుకుంటుంది? అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ఎంతమందిని అట్టిపెట్టుకొవాలి? అనే విషయమై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
మామూలుగా అయితే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఎంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలో అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ చెప్పేస్తుంది. నిర్ణీత సమయంలోపు తమకు జాబితా పంపాలని జట్లను ఆదేశిస్తుంది. అయితే.. ఈసారి నవంబర్‌లో వేలం ఉంటుందనే వార్తల నేపథ్యంలో రిటైన్షన్పై రోజుకో వార్త వైరల్ అవుతోంది. ముగ్గురికే అవకాశమని, లేదు లేదు నలుగురిని అట్టిపెట్టుకోవచ్చే కథనాలు వినిపిస్తన్నాయి.
ఈ గందరగోళానికి చెక్ పెడుతూ ఈసారి కనీసం ఐదుగురిని రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. త్వరలోనే తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. రైట్ టు మ్యాచ్ (RTM) విధానంలో కూడా బీసీసీఐ మార్పులు చేయనుంది. ఒకసారి వేలంలోకి వచ్చాక ఆర్టీఎమ్ ద్వారా ఫలానా ఆటగాళ్లను తమకు కేటాయించాలని ఫ్రాంచైజీలు అడిగే అవకాశం ఉండదు.
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ చివరి వారంలో జరుగనుంది. ఈసారి కూడా విదేశాల్లోనే ఆటగాళ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి కానుంది. నవంబర్ ఆఖరి వారం లేదా డిసెంబర్ తొలి వారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా వేలం జరుగనుంది.