పాట్నా: పండుగ (Jivitputrika) నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విషాదం నెలకొన్నది. నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పిల్లలు, మహిళలు గల్లంతయ్యారు. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించారు. బీహార్లో ఈ సంఘటన జరిగింది. ‘జీవితపుత్రిక’ పండుగ సందర్భంగా తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉంటారు. పిల్లలతో కలిసి పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీశారు.
కాగా, బీహార్లోని తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్పూర్, సమస్తిపూర్, గోపాల్గంజ్, అర్వాల్ జిల్లాల్లో మహిళలు, పిల్లలు మునిగిపోయిన సంఘటనలు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించినట్లు తెలిపింది.
మరోవైపు సీఎం నితీశ్ కుమార్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు.