BCCI : ఆర్సీబీ విజయోత్సవ సభ సమయంలో జరిగిన తొక్కిసలాటను బీసీసీఐ (BCCI) సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతోపై శనివారం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ట్రోఫీ గెలుపు సంబురాల్లో తొక్కిసలాటలు జరగకుండా చూడడం కోసం.. అవసరమైన సూచనలు చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) అధ్యక్షుడిగా ఉన్న ఈ కమిటీలో ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా సభ్యులుగా ఉన్నారు.
ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సమయంలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట మా అందర్నీ కలిచి వేసింది. ఈ ఘటన నిజంగా దురదృష్టకరం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీసీసీఐ భావించింది. అందుకే.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేస్తుంది అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
‘ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవడంతో కర్నాటక ప్రభుత్వం విక్టరీ పరేడ్‌ను నిర్వహిచింది. జూన్ 3న చిన్నస్వామి స్టేడియంలో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు బెంగళూరు ఆటగాళ్లను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్తారు. అసంఖ్యాకంగా వచ్చిన ఫ్యాన్స్‌ను అదుపు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు. 35 వేల మంది సామర్ధ్యమే ఉన్న స్టేడియంలోకి అభిమానులను పంపడంలో నిర్వాహకులు స్పష్టమైన ప్రణాళికతో లేరు.
గేట్ నంబర్ 2, 2ఏ, 6, 7, 15, 17, 18, 20, 21 నంబర్ గేట్ల వధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ సోషల్ మీడియలో అందరికి ప్రవేశం ఉచితం అని పోస్ట్ పెట్టడంతోనే అభిమానులు భారీగా స్టేడియానికి వచ్చారు. అందువల్లే తొక్కిసలాట జరిగింది’ అని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తొక్కసలాటలో మరణించిన వాళ్ల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కర్నాటక ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సైతం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.