దుబాయ్: ఇటీవలే ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి కప్‌ను గెలుచుకున్న భారత జట్టు ట్రోఫీని తీసుకోకుండానే స్వదేశానికి తిరిగిరాగా అందుకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉండగా తాజాగా నఖ్వీ మాత్రం ఆసియా కప్ ట్రోఫీని తన ఆజ్ఞ లేకుండా ఎవ్వరికీ ఇవ్వొద్దని ఆదేశించినట్టు ఏసీసీ వర్గాలు తెలిపాయి.
‘ఆసియా కప్ ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. తన ఆదేశం లేకుండా ట్రోఫీని ఎక్కడికీ తీసుకెళ్లరాదని, ఎవ్వరికీ ఇవ్వరాదని ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బీసీసీఐకి గానీ భారత జట్టు నుంచి గానీ ఎవరైనా వస్తే తన చేతుల మీదుగానే ట్రోఫీని అందజేస్తానని ఆయన ఆదేశించారు’ అని ఏసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు.