BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో కోట్లు వెనకేసుకున్న క్రికెటర్లు చాలామంది. ఆటగాళ్లను కోటీశ్వరులు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంగతి వేరే చెప్పాలా. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఏటా భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒకటి రెండు వేల కోట్లు కాదండోయ్ ఏకంగా 5 వేల కోట్లపైనే భారత బోర్డు ఖజానాలో చేరాయి. అవును.. 16వ సీజన్‌తో బీసీసీఐకి రికార్డు స్థాయిలో రూ. 5,120 కోట్ల లాభం వచ్చింది.
పదిహేనో సీజన్‌తో పోల్చితే ఆదాయంలో పెరుగుదల 116 శాతం అధికంగా ఉండడం విశేషం. బీసీసీఐ తాజగా 2022-23 వార్షిక నివేదిక విడుదల చేసింది. అందులో ఐపీఎల్ నిర్వహణ వ్యయం ఎంత మేర పెరిగింది? అనేది కూడా పేర్కొంది. గతంతో పోల్చితే మెగా టోర్నీ జరిపేందుకు 66 శాతం అదనంగా ఖర్చు పెడుతున్నట్టు బీసీసీఐ తెలిపింది. పదహారో సీజన్ కోసం సుమారు రూ.6,648 కోట్లు వెచ్చించినట్టు భారత బోర్డు వెల్లడించింది.
ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ పాలిట ఐపీఎల్ బంగారు బాతులా మారింది. 2008లో తొలి సీజన్‌తో ఆరంభం.. టీవీ ప్రసార, మీడియా హక్కులు, ప్రకటనలు, ఫ్రాంచైజీలు చెల్లించే సొమ్ము.. ఇలా ప్రతి సీజన్లో దండిగా డబ్బులు వస్తున్నాయి. సీజన్ సీజన్‌కు ఐపీఎల్ క్రేజ్ పెరగడం కూడా బీసీసీఐ గల్లా పెట్టెను నింపుతోంది. దాంతో, నిత్యం భారత బోర్డు ఖజానా నిండుకుండలా ఉంటోంది. త్వరలోనే 18వ సీజన్‌కు ముందు ఐపీఎల్ మెగా వేలం జరుగనుంది.