సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ) : రహదారులపై నీరు నిలవడం వల్ల ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి (Amrapali) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం అడిషనల్, జోనల్ కమిషనర్లతో ఆమ్రపాలి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రధాన రహదారిపై ప్రాజెక్టు సైట్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రహదారులపై మరమ్మత్తులు చేస్తున్న స్థలం వద్ద ప్రమాదం సంభవించకుండా..భద్రతా చర్యల్లో భాగంగా బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులతో పాటు రాత్రి సమయంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బహుళ అంతస్థుల నిర్మాణాలు, నాలాలు, నీటి వనరుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాలతో(Heavy rains) ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
మెహిదీపట్నం, హఫీజ్‌నగర్, అత్తాపపూర్, గుడి మల్కాపూర్, విజయ్‌నగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వాటర్ లాగింగ్ పాయింట్లను కమిషనర్ పరిశీలించారు. వర్షాలతో తలెత్తిన సమస్యలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. స్మార్ట్ వాటర్ డ్రైన్ మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేయవద్దని కమిషనర్ సూచించారు.