అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు ప్రాంతాల నుంచి గంజాయి రవాణాచేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్ విల్లాలో ఉత్తరప్రదేశ్‌లోని మేరట్, ఢిల్లీకి చెందిన ముగ్గురు గత ఏడాదిగా ఢిల్లీకి గంజాయిని రవాణా చేస్తున్నారని తెలిపారు. మేరఠ్‌కు చెందిన మహ్మద్ వసీం, అరకులోయలోని విశ్వనాథం నుంచి గంజాయిని కొనుగోలు చేసి అలాం ఖుర్షిద్ ద్వారా ఢిల్లీకి రవాణా చేస్తున్నారని వివరించారు.ఈ ముగ్గురు విజయనగరం లోని వేర్వేరు ఇండ్లల్లో అద్దెకు ఉంటూ గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కబీర్‌గా గుర్తించామని, మరో 5గురు గంజాయి రవాణాలో ప్రమేయం ఉందని తెలిపారు. నిందితుల నుంచి 22 కిలోల గంజాయి, రవాణాకు వినియోగిస్తున్న వస్తువులు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. మిగతా నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు.