IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ వేదికపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3న జరగాల్సిన టైటిల్ పోరుకు ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) ఆతిథ్యం ఇవ్వనుందనేవార్తలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చెక్ పెట్టింది. వరసగా సమావేశాల అనంతరం చివరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఫైనల్ ఆడించాలని తీర్మానించింది. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. దాంతో, ఇన్నిరోజులుగా మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఎండ్ కార్డ్ పడినట్టైంది.
ఫైనల్ మ్యాచ్ వేదికపై స్పష్టతనిచ్చిన బీసీసీఐ.. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ కోసం స్టేడియాలను ఎంపిక చేసింది. మే 29న నిర్వహించనున్న క్వాలిఫయర్ 1కు ముల్లనూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 30న ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఛండీగఢ్‌లోని స్టేడియం వేదికగా ఆడిస్తామని చెప్పింది. లక్షమంది సామర్థ్యం ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫయర్ 2, ఫైనల్ జరుగనున్నాయి. దాంతో, గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించాలని స్థానిక అభిమానులు కోరుకుంటున్నారు.
నరేంద్ర మోడీ స్టేడియం
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే25న ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సింది. కానీ, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనంతరం పరిస్థితులతో టోర్నీ వారం పాటు వాయిదా పడింది. దాంతో.. ఆగిపోయిన లీగ్ మ్యాచ్‌ల నిర్వహణతో పాటు ప్లే ఆఫ్స్, ఫైనల్ తేదీలు కూడా మారాయి. అయితే.. టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక కానుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ (Sourav Ganguly) అవన్నీ ఊహగానాలే అని కొట్టిపారేశాడు.
బోర్డుతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని.. ఎలాగైనా ఒప్పించి తమ మైదానంలో ఫైనల్ జరిగేలా చూస్తామని దాదా అన్నాడు. కానీ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) మంతనాలు ఫలించలేదు. దాంతో, ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కోల్‌కతాకు ఇది షాకింగ్ న్యూసే. ఎందుంటే.. ఆనవాయితీ ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ సొంత మైదానంలో ఫైనల్ ఆడించాలి. కానీ.. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు.. ఆ తర్వాతి పరిస్థితుల కారణంగా క్యాబ్ విజ్ఞప్తిని బీసీసీఐ తోసిపుచ్చింది.