Waqf Case | వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే.. దాన్ని మూడు అంశాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తూ.. గత బెంచ్ లాగానే విచారణను పరిమితం చేయాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనానికి తెలిపారు.
కోర్టు మూడు అంశాలను గుర్తించిందని తుషార్ మెహతా తెలిపారు. ఆ మూడు అంశాలపై సమాధానం ఇచ్చామని.. తాజాగా పిటిషనర్లు లిఖితపూర్వక సమర్పణల్లో అనేక ఇతర అంశాలను లేవనెత్తుతున్నారన్నారు. తాము మూడు అంశాలపై అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు. కేసు విచారణను ఈ మూడు అంశాలకే పరిమితం చేయాలనేది కేంద్రం తరఫున విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ వాదనను పిటిషనర్లు వ్యతిరేకించారు. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి సొలిసిటర్ జనరల్ వాదనను వ్యతిరేకించారు. ఇంతకు ముందు ఏప్రిల్ 17న జరిగిన విచారణలో వక్ఫ్ బై-యూజర్‌తో సహా ఏ వక్ఫ్ ఆస్తిని డీ-నోటిఫై చేయబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
అలాగే, వక్ఫ్ బోర్డులలో కొత్త నియామకాలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా.. మూడు అంశాల విషయానికి వస్తే.. వక్ఫ్ బై యూజర్ లేదంటే.. వక్ఫ్ బై డీడ్ కింద వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను తొలగించే అధికారం కాగా.. రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముస్లిమేతరులను నియమించడాన్ని ముస్లింలు వ్యతిరేకించడం రెండో అంశం కాగా.. మూడో అంశం నిబంధనకు సంబంధించింది. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్ అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.