Iran US-Israel War | తగ్గేదే..లే! 13వ రోజూ పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం
అమెరికా-ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అనంతరం నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండో కుమారుడు అయతుల్లా మొజ్తబా ఖమేనీ గురువారం తొలిసారిగా స్పందించారు.
- అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంటాం
- హొర్ముజ్ జలసంధి మూసివేతనూ కొనసాగిస్తాం
- గల్ఫ్‌లోని స్థావరాలను అమెరికా మూసివేయాలి
- లేకపోతే, ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది
- స్కూల్ పిల్లల మృతికి ప్రతీకారం తీర్చుకొంటాం
- తొలి సందేశంలో అమెరికా-ఇజ్రాయెల్‌కు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా వార్నింగ్
- 13వ రోజూ పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం
- ఇరాన్ అణ్వాయుధ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
- సూసైడ్ బోట్‌తో యూఎస్ ట్యాంకర్ పేల్చేసిన ఇరాన్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అమెరికా-ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అనంతరం నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండో కుమారుడు అయతుల్లా మొజ్తబా ఖమేనీ గురువారం తొలిసారిగా స్పందించారు.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను మూసివేయకపోతే, యుద్ధం ఇలాగే కొనసాగుతుందని హెచ్చరించారు. హొర్ముజ్ జలసంధి తెరిచే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. మినాబ్ పాఠశాలపై దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకొంటామన్నారు. ఈ మేరకు మొజ్తబా విడుదల చేసిన ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తమ దేశంపై దాడులకు పాల్పడిన అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు వాటి మిత్ర దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రం చేసింది.
ఇరాక్ ప్రాదేశిక జలాల్లో నిలిపి ఉంచిన రెండు ట్యాంకర్లపై ‘సూసైడ్ బోటు’తో ఇరాన్ దాడులు చేసింది. ఈ ఘటనలో భారతీయుడు ఒకరు మరణించారు. దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా భవనం సమీపంలోనూ ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఇంకోవైపు, ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఇదిలాఉండగా తమ మూడు షరతులకు ఒప్పుకొంటే యుద్ధం ముగించడానికి తాము సిద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు.
మొజ్తబా వార్నింగ్ ఇది..
తమపై దాడులు చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను అమెరికా వెంటనే మూసివేయాలన్నారు. అప్పటివరకూ ఆ బేస్‌లపై దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇక, శత్రువులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధిని మూసివేసే ఉంచుతామని స్పష్టం చేశారు. దాన్ని ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదన్నారు. మినాబ్ పాఠశాలపై జరిగిన దాడుల్లో 160 మంది చిన్నారులు మరణించిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా మొజ్తబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకొంటామన్నారు. యుద్ధంలో గాయపడిన వారికి ఉచిత చికిత్సతో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొంటామని భరోసా ఇచ్చారు.కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఓ కాలు విరిగి మొజ్తబా కోమాలోకి వెళ్లిపోయారని, ఆయన మరణించి ఉంటారని వార్తలు వస్తున్న క్రమంలో ఆయన నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
అట్టుడుకుతున్న పశ్చిమాసియా
దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో బుర్జ్ ఖలీఫా వంటి ప్రఖ్యాత కట్టడాలు ఉన్న డౌన్‌టౌన్‌లోని అల్బదా ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిపింది. మరోవైపు, పర్షియన్ గల్ఫ్‌లో ఇరాక్ తీరం సమీపంలో చమురు సేకరిస్తున్న అమెరికాకు చెందిన సేఫ్సీ విష్ణు, గ్రీస్‌కు చెందిన జెఫిరోస్ చమురు నౌకలపై ఇరాన్ విరుచుకుపడింది.
పేలుడు పదార్థాలతో ఉన్న ఓ సూసైడ్ బోటును వేగంగా ఢీకొట్టి ఈ నౌకలను పేల్చేసింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారతీయుడు ఒకరు మరణించారు. 38 మంది సిబ్బందిని అధికారులు రక్షించారు. మరోవైపు, ఇరాన్‌కు చెందిన భారీ విమానాలను ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇంకోవైపు, ఇరాన్‌లోని టెలిఘాన్ కాంపౌండ్‌లో ఉన్న ఓ అణ్వాయుధ కేంద్రంపై దాడులు చేసినట్టు ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇదిలాఉండగా తమ దాడుల్లో హెజ్బొల్లా లీడర్, బీరుట్‌లోని ఐఆర్జీసీ మిసైల్ యూనిట్ కమాండ్ అబు ధార్ మొహమ్మదీ మృతి చెందినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది.
హొర్ముజ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
హొర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నది. ఆ ప్రభావం భారత్‌పైనా పడింది. దీంతో భారత్ జెండాతో ఉన్న నౌకలు హొర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించినట్టు తొలుత వార్తలు వచ్చాయి.
విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్, ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా భారత్‌కు ఈ ఉపశమనం దక్కినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. భారత నౌకలకు ఇలాంటి వెసులుబాటు ఏమీ ఇవ్వలేదని ఇరాన్ అధికారి ఒకరు చెప్పినట్టు రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. మరోవైపు, హొర్ముజ్ గుండా ప్రయాణించే ఇతర దేశాల నౌకలకు భద్రత కల్పిస్తామంటూ తొలుత ప్రకటించిన అమెరికా యూటర్న్ తీసుకొన్నది.
రూ. లక్ష కోట్ల ఖర్చు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలై ఇప్పటికి 13 రోజులు కావొస్తున్నది. ఇరాన్‌పై దాడులకు అమెరికా పెద్దమొత్తంలో నిధులను వెచ్చిస్తున్నది. యుద్ధం మొదలైన తొలి ఆరు రోజులకు గానూ అగ్రరాజ్యం ఏకంగా రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన సమయంలో ఇరాన్‌లోని మినాబ్‌లో ఉన్న ఓ పాఠశాలపై క్షిపణి దాడి జరిగి 160 మంది చిన్నారులతో పాటు 14 మంది టీచర్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడికి అమెరికానే కారణమని ఇరాన్ ఆరోపించగా, దాన్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అయితే, తాజాగా దీనికి సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే ఈ స్కూల్‌పై అమెరికా దాడి చేసినట్టు.. న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.
చమురు విడుదలకు నిర్ణయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకొన్నది. తమ దగ్గర ఉన్న చమురు నిల్వల్లో 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసేందుకు అంగీకరించింది. మొత్తం విడుదలకు దాదాపు 120 రోజుల సమయం పట్టొచ్చని పేర్కొంది. చమురు సంక్షోభాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొంది. అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయనున్నట్టు తెలిపింది. మరోవైపు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను నిలిపేయాలంటూ బహ్రెయిన్ తీసుకొచ్చిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం లభించింది. ఈ తీర్మానానికి భారత్ సహా 130 దేశాలు కో స్పాన్సర్లుగా ఉన్నాయి. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరూ ఓటేయకపోవడం గమనార్హం. ఇరాన్‌కు మిత్రదేశాలైన చైనా, రష్యా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
హొర్ముజ్‌ను దాటిన తొలి నౌక
లైబీరియా జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ఒకటి హొర్ముజ్ జలసంధిని దాటుకొని ముంబై నౌకాశ్రయానికి చేరుకొన్నది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒక నౌక హొర్ముజ్‌ను దాటడం ఇదే తొలిసారి.

ప్రత్యర్థులకు చిక్కకుండా, ట్రాకింగ్ సిస్టమ్‌కు దొరక్కుండా ఉండేందుకు గోయింగ్ డార్క్ టెక్నిక్‌ను వాడి ఈ నౌక జలసంధిని దాటినట్టు సమాచారం. నౌకలోని సిబ్బంది ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్), ట్రాన్స్పాండర్లను స్విచ్ఛాఫ్ చేయడంతోనే ఈ నౌక రాడార్‌కు దొరకలేదని చెప్తున్నారు. ఈ నౌకను భారతీయ కెప్టెన్ నడిపినట్టు సమాచారం.
యుద్ధ ముగింపునకు 3 షరతులు
యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. అయితే, ఇది జరుగాలంటే తమ మూడు షరతులను అంగీకరించాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించడం, ఇప్పటివరకూ జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం, భవిష్యత్తులో దురాక్రమణలు జరుగకుండా పటిష్ఠమైన అంతర్జాతీయ హామీలను ఇవ్వడం వంటి తమ మూడు షరతులకు అంగీకరిస్తే అమెరికా రగిల్చిన యుద్ధాన్ని ముగించడానికి తాము సిద్ధమని మసౌద్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

