సోమవారం 13 జూలై 2020
Sports - Apr 22, 2020 , 11:55:10

‘సమీప భవిష్యత్తులో క్రికెట్​ పోటీలు ఉండకపోవచ్చు’

‘సమీప భవిష్యత్తులో క్రికెట్​ పోటీలు ఉండకపోవచ్చు’

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడాపోటీలు నిలిచిపోయాయి. మహమ్మారి తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో.. టోర్నీలు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో పోటీలను నిర్వహించాలన్న ప్రదిపాదనలు వస్తున్నాయి. ఈ దిశగా జర్మనీలో మేజర్ ఫుట్​బాల్ టోర్నీ బుందేస్లిగాను మే తొలి వారం నుంచి ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​ల నిర్వహణ ప్రతిపాదనపై స్పందించింది. ఇది సాధ్యం కాదని అభిప్రాయపడింది.

“భారత్​, జర్మనీల సామాజిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. సమీప భవిష్యత్తులో భారత్​లో క్రికెట్ ఉండదు. కానీ, ఒకవేళ… అనే అంశాలు చాలా ఉన్నాయి. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో ఏ క్రీడాపోటీలు జరగవని అనుకుంటున్నా” అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. “ఐపీఎల్ కోసం జట్టు ప్రయాణిస్తే.. విమానాశ్రయాలు, హోటళ్లు, స్టేడియం బయట చాలా మంది జనాలు గుమికూడతారు. భౌతిక దూరం కచ్చితమైన పరిస్థితుల్లో.. వారిని ఎలా నిలువరించగలం.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు క్రికెట్ జరుగకపోవచ్చు” అని భజ్జీ చెప్పాడు.

ఫుట్​బాల్ పోటీలు ప్రేక్షకులు లేకుండా నిర్వహించినా టీవీ సిబ్బందితో పాటు మిగతా విభాగాల సిబ్బంది వందల సంఖ్యలో పని చేయాల్సి ఉంటుందని అఖిల భారత ఫుట్​బాల్ సమాఖ్య(ఏఐఎఫ్​) అధ్యక్షుడు సుబ్రతా దత్ చెప్పాడు. అందులో ఎవరికి కరోనా ఉన్నా కష్టమవుతుందని అన్నాడు. 


logo