e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ స్థిరబుద్ధితోనే ఆత్మజ్ఞానం!

స్థిరబుద్ధితోనే ఆత్మజ్ఞానం!

స్థిరబుద్ధితోనే ఆత్మజ్ఞానం!

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్

భగవద్గీత (2-41)


‘నిశ్చయాత్మక బుద్ధితో స్థిర నిర్ణయం తీసుకోగలిగే జ్ఞానమొక్కటే కర్మయోగంలో ఉంటుంది. అది లేని అనిశ్చిత బుద్ధులు అజ్ఞానబద్ధులే. వారిలో ఎన్ని కోరికలున్నా అవి నెరవేరవు. అటువంటివారిలో లెక్కకు మించిన కోరికలు పలు పలు విధాలుగా ఉంటుంటాయి. దానివల్ల కర్తవ్య నిర్వహణలో పట్టుదల, దీక్ష కొరవడతాయి’. అర్జునునిలోని అనిశ్చితిని తొలగించి, సంపూర్ణ కర్తవ్యదీక్షను ప్రేరేపించాలన్న దృష్టితో శ్రీకృష్ణ పరమాత్ముడు మరోవైపు మానవులకూ ఉండవలసిన ‘నిశ్చయాత్మక బుద్ధి’ ఆవశ్యకతను ఈ రకంగా ప్రబోధించాడు.


‘వ్యవసాయాత్మక బుద్ధి’ అంటే ‘స్థిరబుద్ధి’. బుద్ధిలో స్థిరత్వం ఉన్నవారే చేసే పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు. తమ కర్మలన్నీ ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలని, అందుకోసం క్రమశిక్షణ పాటించాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా కావలసింది ఈ ‘స్థిరబుద్ధే’. కర్మయోగులు పాటించవలసిన ప్రధాన ధర్మం ఇదే. కనుకే, ‘కర్మయోగంలో ఇదొక్కటే ఉంటుంది’ అన్నది శ్రీకృష్ణ భగవానుని ప్రబోధం. ప్రతి మనిషికీ ఇది అత్యంత ప్రధానమైంది. జీవితంలో విజయాలు సాధించాలని అనుకున్నప్పుడు చెక్కుచెదరని ‘స్థిరబుద్ధి’ ఉండాల్సిందే. ‘ఊగిసలాట ధోరణి’ పనికిరాదు. అంతటి స్థిరబుద్ధి లేనివారి బుద్ధులు సంశయాలతో నిండిపోయి, కార్యనిర్వహణకు అడ్డంకులు కలిగిస్తాయి. ‘భగవద్గీత’లోనే మరో సందర్భంలో స్వామి, ‘సంశయాత్మా వినశ్యతి’ అన్నాడు. ఇక్కడ ‘నశించడం’ అంటే, ‘వారిలోని సర్వశక్తులు నశిస్తాయి’ అని చెప్పడమే. అందుకే, పై శ్లోకంలో అటువంటివారి బుద్ధులు అనేక భేదాలతో కర్తవ్యాన్ని ఫలించనీయకుండా చేస్తాయని ఆయన ప్రబోధించాడు. ఈ ‘వ్యవసాయాత్మక బుద్ధియే’ ఆత్మజ్ఞానానికి మార్గం చూపిస్తుందన్న సత్యాన్ని అందరం గ్రహించాలి. అలాంటి స్థిరచిత్తులు స్థితప్రజ్ఞుల వలె కర్తవ్య నిర్వహణలో ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ధైర్యంతో ఎదిరించి, విజయతీరాలను చేరతారు.


‘వామనచరిత్ర’ (శ్రీమద్భాగవతం) ఘట్టంలోని ఒక సన్నివేశమే ఇందుకు చక్కని ఉదాహరణ. ‘మూడడుగుల నేల అడిగిన వామనునికి రెండడుగులూ ఇచ్చేశాక, మూడవ అడుగుకు స్థలం’ చూపలేకపోతాడు బలి చక్రవర్తి. అప్పుడు గురువైన శుక్రాచార్యుడు, ‘బొంకు పలుకవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అదేమీ పాపకార్యం కాదు’ అని చెప్తాడు. అయినా, తన ‘నిశ్చయాత్మక బుద్ధి’ని బలి చక్రవర్తి మార్చుకోలేదు. ‘తిరుగన్‌ నేరదు నాదు జిహ్వ’ అంటాడు. ఈ మాటలు ఆయనలోని ‘అకుంఠిత బుద్ధితత్తాన్ని’ చాటాయి. ఈ రకంగా బలి చక్రవర్తి తన స్థిరచిత్తాన్ని అనుసరించి ప్రవర్తించాడే తప్ప, ఎక్కడా దానినుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. మన లక్ష్యం గొప్పదైనప్పుడు ఆ సాధనలో ‘నిశ్చయాత్మకమైన స్థిరబుద్ధి’ ఉండాలి. అప్పుడే మన ఆశయాన్ని సాధించగలం. ఆ గమ్యం మాత్రం తప్పనిసరిగా పవిత్రమైంది కావాలి. అప్పుడే దాని సాధనకు చేసే ప్రయత్నాలు కూడా పవిత్రమవుతాయి.


నిజమైన కర్మయోగి హృదయం అతి పవిత్రమైన ఆరాధనా భావంతో నిండి ఉంటుంది. ఆ భావన సర్వస్వం ఈశ్వరమయం. అలాంటివారి లక్ష్యం ఈశ్వరాన్వేషణే కనుక, వారిలోని బుద్ధి సుస్థిరత కారణంగా, దాన్ని సాధించాలన్న తపన రెట్టింపవుతుంది. అలాంటివారికే ‘ఆత్మజ్ఞాన సిద్ధి’ అత్యంత సులభమవుతుంది. ‘అనిశ్చిత బుద్ధి’ గలవారికి మార్గం సుగమం కాకపోగా, అనేక సమస్యలు చుట్టుముడతాయి. అందుకే, ‘కేవలం కర్మలు చేయడమే నీ బాధ్యత. వాటి ఫలితం ఆశించవద్దు’ అని భగవానుడు అర్జునుని ద్వారా లోకానికి చాటాడు. కనుక, ధార్మిక సాధనా మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ‘వ్యవసాయాత్మక బుద్ధి’ ప్రాధాన్యాన్ని గుర్తించాలి.

స్థిరబుద్ధితోనే ఆత్మజ్ఞానం!

గన్నమరాజు గిరిజా మనోహర బాబు

ఇవి కూడా చ‌ద‌వండి..

పదవులు పూజలతో వస్తాయా.. పోతాయా..

ఎములాడపై ప్రేమ

హింసా ప్రవృత్తికి మూలమెక్కడ?

Advertisement
స్థిరబుద్ధితోనే ఆత్మజ్ఞానం!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement