e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home pvnr100years హింసా ప్రవృత్తికి మూలమెక్కడ?

హింసా ప్రవృత్తికి మూలమెక్కడ?

హింసా ప్రవృత్తికి మూలమెక్కడ?

గాంధీజీ అహింసా సిద్ధాంతం చాలా విస్తృతమైంది. ఆచరణలోనే కాదు, ఆలోచనలో కూడా అహింసా సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించారు. సాంఘిక కార్యాచరణలో అనుసరించే క్రమశిక్షణా పద్ధతి మాత్రమే కాక, ఆలోచనా విధానాన్ని క్రమబద్ధం చేసుకోవడం ద్వారా జీవిత విధానాన్నే అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా మలచుకోవడం ఆయన సిద్ధాంతంలోని విశిష్టత. మరో మాటలో చెప్పాలంటే గాంధీజీ అహింసా సిద్ధాంతం అనేది మనసులో బాగా నాటుకొని పోవలసిన సిద్ధాంతం. ఆచరణలోనూ, ప్రవర్తనలోనూ దాని ప్రదర్శన మానసిక స్థితి బాహిర ప్రదర్శన మాత్రమే. అయితే మామూలుగా మనం హింస గురించి మాట్లాడుకునేటప్పుడు మనం చర్చించే హింస, సాంఘిక కార్యాచరణ క్రమంలో బయటపడుతున్న హింస గురించే కాని, మానసిక స్థితి గురించి కాదు.

అటు సాంఘిక కార్యాచరణలకూ, ఇటు వ్యక్తిగత కార్యాచరణకూ కొన్ని పద్ధతులను నిర్ణయించిన గాంధేయ విధానం- గాంధీజీ సిద్ధాంతాలూ ఒక పునాదిగా, మార్క్సిజం మరో పునాదిగా, ఆధునిక సాంఘిక శాస్త్రం మరో పునాదిగా తీసుకొని అధ్యయనం చేసినట్లయితే, ఈ వైఖరులను వివేచన చేసుకోవడానికీ, నూతన పద్ధతులనూ, విలువలనూ రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. పునాది ఏదైనా కానీ ఈ సమస్యను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ఈనాటి ముఖ్యావసరమనేది నిర్వివాదాంశం.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గాంధీజీ అన్నట్లు మెజారిటీ ఏకపక్షపాలనగా మారే ప్రమాదం ఉన్నది కనుక ప్రజాస్వామ్యంలో మైనారిటీలకు కొన్ని రక్షణలు కల్పించవలసి ఉంటుంది. పేదలు మైనారిటీలుగా రూపొందిన అమెరికాలో ఇది నేటి ప్రధాన సమస్య.

విభిన్న సమాజాల మధ్య సామూహిక హింసా చర్యలను గురించి లేదా సాంఘిక కార్యాచరణ సాధనంగా హింసను వాడటాన్ని గురించి పోల్చి చర్చించడానికి మనం పూనుకున్నప్పుడు ఆయా సమాజంలోని వ్యక్తులలో- మానవ ప్రవృత్తిలోనే హింసాయుత వైఖరులు అధికంగా ఉండటం కారణమనే నిర్ణయానికి రావడంవల్ల తరుచుగా తప్పటడుగు వేయడం జరుగుతుంది. అయితే మన సమాజంలో మొదటినుంచీ ఉండి ఇప్పటికీ కొనసాగుతూ, ఇటీవలి కాలంలో మరింత తీవ్రతను సంతరించుకున్న వైఖరులను జాగ్రత్తగా ప్రశాంత చిత్తంతో పరిశీలించినట్లయితే పై నిర్ధారణ విధిగా వాస్తవికం కానక్కర లేదని తేలుతుంది. అందువల్ల హింసా ప్రవృత్తులకు అనుకూలమైన వైఖరి పెరుగుతున్నదనుకున్నప్పుడు మనం మానసిక ప్రవృత్తినీ, సాంఘిక పరిస్థితులనూ జాగ్రత్తగా వివేచన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. హింసాయుత వైఖరులకు ప్రధానంగా బాధ్యత వహించేవి ఈ పరిస్థితులే.

పోరాటం లేకుండా ఏ కోరికా సిద్ధించదనీ, ఏ కాస్తో హింసలేకపోతే ఏ పోరాటమూ ప్రభావము చూపదనే విశ్వాసం హింసా చర్యలు పెచ్చరిల్లడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం, మారిన పరిస్థితులకు అనుగుణంగా మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అవసరమైనంతమేర బాధ్యతాయుత వైఖరిని పెంపొందించుకోకపోవడం. అంటే దీని అర్థం స్వాతంత్రం రాకపూర్వం ఉన్న ప్రభుత్వాలు చాలా బాధ్యతాయుతంగా ఉండేవని కాదు. అయితే అవి బాధ్యతాయుతంగా ఉండాలని ఎవరూ ఆశించలేదు. స్వపరిపాలనకు అనుకూలంగా చెప్పిన కారణాల్లో ఇది కూడా ఒకటి. ప్రజలకు మేలు చేకూర్చి, ఆర్తులను ఆదుకోవలసిన బాధ్యత గల మన ప్రభుత్వ యంత్రాంగం నేడు ప్రజల సమస్యలనూ, వారి ఆకాంక్షలను అవగాహన చేసుకొని వారికి సంతృప్తిని కలిగించే చర్యలు చేపట్టేవిధంగా ఎదగకపోవడం విచారకరం. పరిపాలనా యంత్రాంగంతో సంబంధం ఉన్న అనధికార బృందం సభ్యులు అప్పుడప్పుడూ బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శిస్తున్న మాట నిజమే కానీ, సంకుచిత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలను సాధించుకోవడంలో తృప్తి పడి ప్రధాన సమస్య పరిష్కారం గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ప్రజలలో పోరాట వైఖరి పెరుగుతున్న కొద్దీ ఒక రకమైన విషవలయం ఏర్పడి క్రమంగా మరింత విషతుల్యం అవుతూ పెచ్చరిల్లుతుంది. అయితే హింసాయుత చర్యలకు దారితీసే పోరాట వైఖరికి సదా ప్రభుత్వ యంత్రాంగపు బాధ్యతారహిత వైఖరే కారణమని కచ్చితంగా చెప్పలేం. వ్యక్తిగత లాభాలూ, ముఠా గత ప్రయోజనాలే సర్వస్వంగా భావించే ఒకరకమైన మానసిక స్థితివల్ల, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు విధిగా చొరవ తీసుకొనవలసిన సందర్భాల్లో సైతం బొత్తిగా చొరవగానీ ప్రమేయంగానీ పెట్టుకొన కుండా ఉండే వైఖరి పెంపొందటం – దీనికి మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో ఏదన్నా లోపం ఉన్నదో-ప్రజాస్వామ్య వ్యవస్థకూ, మన ప్రజల మనస్తత్వానికి గల సంబంధంలో ఏదన్నా లోపం ఉన్నదో విపులంగా పరిశోధన జరపాల్సిన అంశాలు.

ప్రాతినిథ్యం అంటే బాధ్యతాయుత వైఖరి దానికదే వస్తుందనీ ప్రజాస్వామ్య ప్రాతినిథ్య సంస్థలు ప్రజల ఆకాంక్షల పట్ల బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శిస్తాయని మనం భావించాం. అయితే ఈ సిద్ధాంతం ఆచరణలో అనేక సందర్భాల్లో రుజువు కాలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ చరిత్రను పరిశీలించినా ఈ సిద్ధాంతం కచ్చితంగా రుజువు కాగలదని చెప్పలేం. బ్రిటిష్‌ పార్లమెంట్‌ సంపూర్ణ ప్రాతినిధ్య సంస్థగా రూపొందకముందు చాలా కాలం క్రితమే సమాజంలోని అవసరాలూ, ఆకాంక్షలూ, మార్పులపట్ల బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శించింది.

మన దేశంలో సంపూర్ణ ప్రాతినిథ్య సంస్థలు కూడా పూర్తి బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శించటం లేదనిపిస్తుంది. అందువల్ల ప్రజాస్వామ్య ప్రభుత్వాలు బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శించేటట్లు చేయడం ఎలాగనేది సమస్య.

భయం, సందేహం, స్వీయరక్షణాకాంక్ష మొదలైన మానసిక పరిస్థితులు కలిసికట్టు ప్రభావంగా హింసా వైఖరి ఉత్పన్నం కావడం అనేక సందర్భాలలో గోచరిస్తుంది. మానసిక శాస్త్ర రీత్యా చూసినట్లయితే భయాన్నీ, సందేహాన్నీ రూపుమాపడానికి ప్రయత్నించినట్లయితే హింసను తగ్గించవచ్చుననిపిస్తుంది. అయితే భయ-సందేహాలు రూపుమాపడం ఎలా? నిరు పేదల్లో నిరు పేదకు, చిన్నవారిలో చిన్నవారికి భద్రత వున్నదన్న నమ్మకం కలిగినప్పుడే, అలాంటి సమాజం రూపొందినప్పుడే కదా ఇది సాధ్యమయ్యేది. ఉపన్యాసాల ద్వారా, వాగ్దానాల ద్వారా, హామీల ద్వారా కాక ఈ పని ఆచరణ రీత్యా జరగాలి. మరో మాటలో చెప్పాలంటే, అతిఘోరమైన హింసగా మహాత్మా గాంధీగారు వర్ణించిన ’దోపిడి’ లేని సమాజం ఏర్పడినప్పుడే అది సాధ్యం అవుతుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో మైనారిటీ వర్గాల కు కల్పించే రక్షణ ఎలా ఉండాలి? ప్రజాస్వామ్యంలో ప్రతివాడూ మెజారిటికీ తోకలై పోతున్న పరిస్థితిలో మైనారిటీలవారి మాట వినే వాడుగానీ పట్టించుకునే వాడుగానీ లేడనీ, తమ మాటను గట్టిగా వినిపింవ చెయ్యాలంటే హింస తప్ప వేరే మార్గం లేదని మైనారిటీలకు అనిపించటం కూడా సామాజిక హింసా వైఖరులు పెరగడానికి ఒక కారణం.

‘సత్యాగ్రహం’ సైతం బలమైన ఆయుధం గా పనిచేయగలదా? ఆధ్యాత్మికంగా పరిశీలించినప్పుడు తాను అన్యాయం అని భావించే దానిని ఒకే ఒక వ్యక్తి తిరస్కరించడమనేది దానికదిగా ఒక గొప్ప లక్ష్యమేకాని, సత్యాగ్రహం లేదా సహాయ నిరాకరణ సాంఘిక చర్యగా ప్రభావం చూపించాలంటే, సహాయ నిరాకరణ చేసేవారి సం ఖ్య, సమాజంలోని ఇతరుల దృష్టిలో గణనీయంగా పెరిగినప్పుడే సాధ్యమౌతుంది.

(పీవీ నరసింహారావు అముద్రిత ఇంగ్లీషు ప్రసంగానికి తెలుగు అనువాదం)

ఇవి కూడా చ‌ద‌వండి..

పదవులు పూజలతో వస్తాయా.. పోతాయా..

ఎములాడపై ప్రేమ

స్థిరబుద్ధితోనే ఆత్మజ్ఞానం!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హింసా ప్రవృత్తికి మూలమెక్కడ?

ట్రెండింగ్‌

Advertisement