Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో ఉన్న విలువైన భూమికి సంబంధించి సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పలు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి కూడా ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన రామ్ తాళ్లూరి, పవన్ కళ్యాణ్ జీవితాన్ని త్యాగం, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా అభివర్ణించారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు వాస్తవాల ఆధారంగా కాకుండా రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న ప్రచారమని పేర్కొన్నారు. ప్రజల్లో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తట్టుకోలేక కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజా జీవితమంతా అందరికీ తెలిసిన ఓ తెరిచిన పుస్తకం లాంటిదని, ఆయనపై ఎలాంటి అసత్య ప్రచారం చేసినా ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయలేరని రామ్ తాళ్లూరి వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లోనే ఇలాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయని, ప్రజల మద్దతు కోల్పోయిన వారు చివరికి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ఇక ఈ వ్యవహారంపై జనసేన పార్టీ నేతలు కూడా స్పష్టమైన వివరణ ఇచ్చారు. జన్వాడలో ఉన్న భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని, దానిపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. ఆ భూమిని పవన్ కళ్యాణ్ 2014లోనే కొనుగోలు చేశారని, తర్వాతి కాలంలో అవసరమైన ప్రక్రియల ద్వారా మ్యుటేషన్ కూడా పూర్తి చేసినట్లు వివరించారు.
పార్టీ నేతల ప్రకారం, ఆ భూమిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని, అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు, పంట తోటలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు చట్టబద్ధంగానే ఉన్నాయని, కబ్జా అనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఈ అంశంపై స్పందిస్తూ, పవన్ కళ్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. మరోవైపు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కూడా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మాట్లాడారు. వివాదాస్పదంగా మారిన భూమి పూర్తిగా చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమేనని, దీనికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు, అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా సంబంధిత పన్నులు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని తెలిపారు.