Fire Accident | దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. వికాస్మార్గ్లోని స్కూల్ ఆఫ్ ఫ్లానింగ్ భవనం రెండో అంతస్తులో ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
8 ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉదయం సుమారు 9.37 గంటల సమయంలో అగ్నిప్రమాదంపై తమకు సమాచారం అందినట్లుగా అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.
ప్రమాదం జరిగిన అంతస్తులో విద్యాశాఖకు చెందిన పలు కార్యాలయాలు, అధ్యాపక సభ్యుల క్యాబిన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మొదట ఏసీలో నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు.