జార్జియా: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకున్నది. 25 ఏళ్ల భారతీయ సంతతి పైలెట్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. తన భాగస్వామిని పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో వధువు సజీవంగా ఉంది. సుమారు 5 గంటల పాటు శిథిలాల కింద ఉన్న ఆమెను చివరకు రక్షించారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన రాబిన్సన్ ఆర్66 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలెట్‌గా చేస్తున్న మరో వ్యక్తి కూడా చనిపోయాడు. డాసన్ విల్లే కౌంటీలో జరిగిన ప్రమాదంలో భారతీయ మూలాల ఉన్న దవే ఫిజి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య జెస్నీకి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.
ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు దవే ఫిజి జంట పెళ్లి చేసుకున్నది. డాసన్‌విల్లే సమీపంలో ఉన్న ద రివరీ వెడ్డింగ్ వేదికలో ఆ జంట పెళ్లి జరిగింది. వివాహ వేడుక పర్‌ఫక్ట్‌గా జరిగిందని, కానీ అట్లాంటాలో ఉన్న హోటల్‌కు వెళ్లేందుకు హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. దవే తల్లితండ్రులు కేరళలోని ఎర్నాకుళం జిల్లా నుంచి అమెరికాకు వలసవెళ్లారు. కుమారుడి మరణం ఘటనతో ఆ పేరెంట్స్ విలపిస్తున్నారు.
వాస్తవానికి పెళ్లి వేడుక ముగిసే వరకు రాత్రి 9 దాటిందని, ఆ సమయంలో వర్షం కురుస్తోందని, పొగ మంచు కూడా ఎక్కువగా ఉన్నట్లు దవే తండ్రి జార్జ్ ఫిజీ తెలిపారు. ఇలాంటి వాతావరణంలో గగన ప్రయాణం ఇబ్బందికరమే అని తన కుమారుడు కూడా ఆందోళన వ్యక్తం చేశాడని తండ్రి జార్జ్ గుర్తు చేశారు. అయితే హయ్యర్ ఆల్టిట్యూడ్‌లో కొత్త జంటను తీసుకెళ్తానని హెలికాప్టర్ పైలెట్ చెప్పడంతో ప్రయాణం జరిగిందని, కానీ డాసన్ విల్లే వద్ద ఉన్న కొండల్లో ఆ విమానం కూలినట్లు గుర్తించామన్నారు.
రెస్క్యూ బృందాలు హెలికాప్టర్ ప్రమాద ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు 5 గంటల పాటు శిథిలాల కిందే జెస్నీ ఉన్నట్లు చెప్పారు. వృత్తి రీత్యా జెస్నీ ఓ నర్సు. ప్రమాదంలో ఆమెకు ఫ్రాక్చర్లు కాలేదు. కానీ తీవ్రమైన రీతిలో దెబ్బలు తగిలాయి. ప్రమాదం పట్ల నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ చేపట్టింది. 30 రోజుల్లో నివేదిక రానున్నది.