Bangladesh : త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో ఇండియాలో పాల్గొనడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇండియాలో పాల్గొనాలంటే తమ జట్టుకు తగిన భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతూ.. ఐసీసీకి మరో లేఖ రాసింది. ఈ అంశంలో ఇది ఐసీసీకి బంగ్లా రాసిన రెండో లేఖ. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి నేపథ్యంలో ఇండియా-బంగ్లా మధ్య ఇటీవల వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తొలగించారు.
దీంతో వివాదం మరింత ముదిరింది. అందుకే ఇండియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో తాము పాల్గొనబోమని, తమ జట్టు ఇండియాలో ఆడే మ్యాచు వేదికల్ని శ్రీలంక లేదా మరో దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ).. ఐసీసీకి లేఖ రాసింది. అయితే, ఇప్పుడు మ్యాచు వేదికల్ని మార్చడం సాధ్యం కాదని ఐసీసీ తెలిపింది. టోర్నీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు వేదిక మార్చడం సాధ్యం కాదని ఐసీసీ తెలిపింది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. దీంతో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇండియాలో ఆడేందుకు తాము సిద్ధమే అని.. అయితే, ప్రతి ఒక్కరికి ప్రత్యేక భద్రతతోపాటు వ్యక్తిగత భద్రత కూడా కల్పించాలని ఐసీసీని కోరింది.
అలా భద్రతకు హామీ ఇస్తే ఇండియాలో ఆడేందుకు అభ్యంతరం లేదని లేఖలో వివరించింది. దీనికి స్పందించిన ఐసీసీ తగినంత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై స్పష్టమైన స్పందన త్వరలోనే రానుంది. అప్పుడే ఇండియాకు బంగ్లా వచ్చేది.. రానిది తెలుస్తుంది. ఇక.. టీ20 వరల్డ్ కప్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇండియా, శ్రీలంకలలో ఈ టోర్నీ జరగనుంది.