BANW vs SCOW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బోణీ కొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో స్కాట్లాండ్ (Scotland)పై జయభేరి మోగించింది. బ్యాటర్లు పెద్దగా రాణించకున్నా బౌలర్ల అద్బుత ప్రదర్శనతో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ వికెట్ కీపర్ సరాహ్ బ్రైసీ(49 నాటౌట్) కడదాకా పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. తద్వారా పొట్టి వరల్డ్ కప్‌లో వరుసగా 16 ఓటముల తర్వాత తొలి విజయం బంగ్లా ఖాతాలో చేరింది.
మహిళల టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్లో మొదటి బోణీ బంగ్లాదేశ్‌దే. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో నిగర్ సుల్తానా సారథ్యంలోని బంగ్లా సమిష్ఠి పోరాటంతో స్కాంట్లాడ్కు చెక్ పెట్టింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బౌలర్లు రితు మొని(2/15), నిహిదా అక్తర్(1/19)లు రాణించడంతో 16 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది.
Bangladesh break a 16-game losing streak at the women’s #T20WorldCup – their first win since they hosted the tournament in 2014 🇧🇩 pic.twitter.com/rXWZiJjTLc
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2024
టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ను స్కాట్లాండ్ బౌలర్లు సస్కియా హొర్లే(3/13), ఒలివియా బీల్(1/23)లు తక్కువకే కట్టడి చేశారు. శోభన మోస్ట్రే(36), ఓపెనర్ శాతీ రాణి(29)ల పోరాటంతో బంగ్లా 7 వికెట్ల నష్టానికి 109 రన్స్ కొట్టింది. అనంతరం
స్వల్ప ఛేదనలో స్కాంట్లాండ్ ఆది నుంచి తడబడింది.
ఓపెనర్ సస్కియా హొర్లే(8)ను ఫహిమా ఖాతూన్ ఔట్ చేసి స్కాంట్లాండ్ను దెబ్బకొట్టింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ క్యాథరిన్ బ్రిసే(11), ఐసా లీస్టర్(11)లు సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ సరాహ్ బ్రైసీ(49 నాటౌట్) మాత్రం పట్టు వదల్లేదు. బంగ్లా బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నా సరే.. జట్టును గెలిపించేందుకు చివరిదాకా పోరాడింది. కానీ, మరుఫా అక్తర్, రితు మొనిలు పరుగులు కట్టడి చేసి బంగ్లాను గెలుపు దిశగా నడిపించారు.