చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో దళితులపై నేరాలు 40 శాతం పెరిగాయని తెలిపారు. దళితులపై కొనసాగుతున్న సామాజిక వివక్షను ఆయన విమర్శించారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడారు. ‘ఆయన (గాంధీ) చరఖాను ఉపయోగించినప్పుడు, అది స్వదేశీ గర్వకారణం, స్వావలంబన, ఆర్థిక వ్యవస్థపై విదేశీ నియంత్రణ నుంచి విముక్తికి చిహ్నంగా ఉంది. బ్రిటీష్ వారు వెళ్లిపోయారు. అయినా దళితులు ఇంకా స్వతంత్రంగా లేరు’ అని అన్నారు.
కాగా, దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను ఈ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రస్తావించారు.
కొన్ని వీధుల్లో నడవడానికి, దేవాలయాలలోకి ప్రవేశించడానికి దళితులకు అనుమతి లేదని తెలిపారు. మానవ వ్యర్థాలు కలిసిన నీటి ట్యాంకులు కలిగిన క్రూరమైన చర్యలకు వారు గురైనట్లు చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలను ఉటంకించారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో దళితులపై నేరాలు 40 శాతం పెరిగాయని అన్నారు. తమిళనాడులో దళిత మహిళలపై అత్యాచారం కేసుల్లో శిక్షా రేటు జాతీయ సగటులో సగం అని వివరించారు.
మరోవైపు కళ్లకురిచిలో జరిగిన కల్తీ మద్యం దుర్ఘటనలో 60 మందికి పైగా దళితులు మరణించడం సామాజిక, ఆర్థిక వివక్షకు స్పష్టమైన ఉదాహరణ అని గవర్నర్ రవి తెలిపారు. మద్యం మాఫియాలో దళితులు కూడా బాధితులేనని అన్నారు. తమిళనాడు పాఠశాలల్లోని దళిత వంట మనుషులు వండిన భోజనం తినడానికి కొందరు విద్యార్థులు నిరాకరించడాన్ని గుర్తు చేశారు. ఈ చర్యలు బాధాకరమైనవి, ఆమోదయోగ్యం కానివి అన్నారు. ‘తమిళనాడులో దళితులపై జరుగుతున్న తీరు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది’ అని వ్యాఖ్యానించారు.
అయితే గవర్నర్ రవి వ్యాఖ్యలను తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి ఖండించారు. రాష్ట్రంలో కులం కారణంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేశారన్న భావనకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ‘అందరినీ సోదరులుగా చూస్తాం. రాష్ట్ర ప్రజలను కులం లేదా మతం పరంగా విభజించలేదు’ అని అన్నారు.