Mahindra Thar ROXX | గతంతో పోలిస్తే ఎస్యూవీ కార్లపై ప్రతి ఒక్కరూ మోజు పెంచుకుంటున్నారు. ఎస్యూవీ సెగ్మెంట్లో గణనీయ మార్కెట్ వాటా పొందుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా మరో సంచలనం సృష్టించింది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఆఫ్రోడ్ ఎస్యూవీ 5-డోర్ థార్ రాక్స్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం బుకింగ్స్ ప్రారంభమైన గంట సేపట్లో 1,76,218 యూనిట్ల కార్ల బుకింగ్స్ నమోదయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఒక రోజులో అత్యధికంగా బుకింగ్స్ నమోదైన మహీంద్రా అండ్ మహీంద్రా కారు థార్ రాక్స్.
విజయదశమి నుంచి థార్ రాక్స్ కార్ల డెలివరీ ప్రారంభం అవుతుందని మహీంద్రా తెలిపింది. బుక్ చేసుకున్న కస్టమర్లకు తాత్కాలిక డెలివరీ షెడ్యూల్ మూడు వారాల్లో తెలియజేస్తామని పేర్కొంది. 2022లో మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా స్కార్పియో -ఎన్ కారు బుకింగ్స్ మొదలైన నిమిషంలోపే 25 వేల కార్ల బుకింగ్స్ జరిగితే 90 నిమిషాల్లో లక్ష యూనిట్లు బుక్ అయ్యాయి. స్కార్పియో-ఎన్తో పోలిస్తే అత్యధికంగా ప్రీ బుకింగ్స్ నమోదైన మోడల్ కారు థార్ రాక్స్. ఈ కారు ధర రూ.13 లక్షల నుంచి రూ.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. ప్రస్తుతం 5-డోర్ థార్ రాక్స్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది.