కొలంబో: శ్రీలంక పర్యటనలో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఇరుజట్ల మధ్య జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్.. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో లంక గెలవగా మిగతా రెండింటినీ బంగ్లా గెలుచుకుంది.
లంక గడ్డపై టీ20 సిరీస్ గెలవడం బంగ్లాకు ఇదే తొలిసారి. లంక నిర్దేశించిన 133 పరుగుల ఛేదనను బంగ్లా.. 16.3 ఓవర్లలోనే దంచేసింది. ఓపెనర్లు తాంజిద్ హసన్ (73 నాటౌట్), కెప్టెన్ లిటన్ దాస్ (32) ధాటిగా ఆడి ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లంక.. మెహిది హసన్ (4/11) బౌలింగ్‌కు కుదేలై 20 ఓవర్లలో 132/7కే పరిమితమైంది.