Champions Trophy | రావల్పిండి: మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ టోర్నీని ముగించింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడి ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్.. సొంత అభిమానుల ఎదుట కనీసం పరువు నిలుపుకునేందుకైనా ఆడాలని ఆశపడ్డ మ్యాచ్‌పై వరుణుడు నీళ్లుచల్లాడు. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో గురువారం జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ కూడా పడకుండా రద్దయింది. దీంతో ఇరుజట్లకూ తలా ఓ పాయింట్ దక్కినా గ్రూప్-ఏలో పాకిస్థాన్.. నాలుగో స్థానంలో అట్టడుగు స్థానంలో నిలవడం గమనార్హం. బంగ్లాదేశ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాయి.
ఈ టోర్నీలో దారుణ వైఫల్యంతో పాకిస్థాన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 23 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో ఆతిథ్య జట్టు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిష్క్రమించడం ఇదే ప్రథమం. 1998లో మొదలై బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీ (అప్పుడు బంగ్లాదేశ్ ఆడలేదు).. 2000లో నైరోబిలో జరిగింది. రెండో ఎడిషన్‌లో కెన్యా ప్రీక్వార్టర్ ఫైనల్ చేరింది. 2002 నుంచి ఈ టోర్నీ ఆతిథ్యమిస్తున్న జట్లు గ్రూప్ దశలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచాయి. 2006లో భారత్, 2009లో సౌతాఫ్రికాలో నిర్వహించిన ఈ టోర్నీలో ఆ జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచినా ఒక్క మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. ఇక 29 ఏండ్ల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీలో పాక్.. సొంతగడ్డపై ఒకే ఒక మ్యాచ్ ఆడగా అందులోనూ ఓడి స్థానిక అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.