Mahmuadullah : భారత పర్యటనలో గెలుపు కోసం ఎదురుచూస్తున్న బంగ్లాదేశ్‌కు పిడుగులాంటి వార్త. ఇప్పటికే మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలకగా.. మరో ఆటగాడు సైతం జట్టును వీడనున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (Mahmuadullah) సైతం పొట్టి క్రికెట్‌కు బైబై చెప్పేశాడు. టీమిండియాతో జరిగే మూడు టీ20 సిరీస్‌తోనే తన కెరీర్ ముగించబోతున్నట్టు మహ్మదుల్లా తెలిపాడు. దాంతో, అతడి17 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వచ్చే అక్టోబర్ 12వ తేదీన ఎండ్ కార్డ్ పడనుంది.
‘ఇండియాతో ఆఖరి టీ20 తర్వాత పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. భారత్‌కు రాకముందే రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఈ విషయమైన మా కుటుంబ సభ్యులు, కెప్టెన్, కోచ్‌లతో మాట్లాడాను కూడా. టీ20లకు అల్విదా చెప్పేందుకు, వన్డేలపై దృష్టి పెట్టేందుకు ఇదే సరైన సమయం అనిపించింది అని మహ్మదుల్లా’ తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు.
End of an Era! Mahmudullah bids farewell to T20Is after the India vs Bangladesh series#Mahmudullah #retirement #INDvsBAN #Bangladesh pic.twitter.com/xdMwSFvYMI
— XtraTime (@xtratimeindia) October 8, 2024
తన కెరీర్లో ఎక్కువ బాధించిన ఓటమి గురించి చెబుతూ.. 2016 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు చేతిలో పరాజయం నన్ను ఎంతో వేదనకు గురి చేసింది అని మహ్మదుల్లా అన్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 147 పరుగుల ఛేదనలో చివరిదాకా పోరాడిన బంగ్లాదేశ్ ఒక్క పరుగు తేడాతో ఓడింది.
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన మహ్మదుల్లా 2007లో కెన్యాపై తొలి టీ20 ఆడాడు. మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం బంగ్లాదేశ్ జట్టులో కొనసాగాడు. పొట్టి క్రికెట్లో మాత్రం ఎక్కువ కాలం ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌కే చెందిన షకీబుల్ హసన్, బెన్ సియర్స్లు అతడి కంటే ముందున్నారు. ఇక.. పొట్టి క్రికెట్లో మహ్మదుల్లా 139 మ్యాచ్‌లు ఆడాడు. 117.74 స్ట్రయిక్ రేటుతో 2,394 పరుగులు సాధించాడు. అంతేకాదు బంతితోనూ రాణించి 40 వికెట్లు పడగొట్టాడు.