Shorna Akter : క్రికెట్లో జాతీయ జట్టుకు ఆడాలనేది ఆమె కల. ఆ కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. దాంతో, ఆరంగేట్రం మ్యాచ్‌ను అద్భుత జ్ఞాపకంగా మలుచుకోవాలి అనుకుంది. కానీ, జరిగింది వేరు. తీవ్ర అనారోగ్యంతో ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకు ఆమె ఎవరంటే..? బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్(Bangladesh Women Cricketer). పేరు.. షొర్నా అక్తర్(Shorna Akter). భారత మహిళల జట్టుతో వన్డే సిరీస్‌కు ఎంపికైన షొర్నాఈరోజు డెబ్యూట్ క్యాప్ అందుకుంది. బ్యాటింగ్‌కు రావడానికి ముందు ఆమె అపెండిసైటిస్ (Appendicitis) నొప్పితో బాధపడింది. దాంతో, షొర్నాను వెంటనే దవాఖానకు తరలించారు.
16 ఏళ్ల షొర్న ఈ ఏడాది ప్రారంభంలో అండర్ -19 వరల్డ్ కప్(Under – 19 World Cup) ఆడింది. ఆ టోర్నమెంట్లో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడింది. దాంతో, భారత పర్యటనకు ఎంపిక చేశారు. అయితే.. మూడు టీ 20 సిరీస్‌లో షొర్నా 37 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచింది. అందుకని వన్డే సిరీస్‌లో అయినా బ్యాట్ ఝులిపించాలని అనుకుంది. కానీ, అపెండిసైటిస్ కారణంగా ఆమెకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాంతో, ఆరంగ్రేటం వన్డేలో అదరగొట్టాలనుకున్న షొర్నా ఆశలు ఆడియాసలయ్యాయి. ఇప్పటివరకు 7 టీ20 ఆడిన ఈ బంగ్లా యువ కెరటం 81.35 స్ట్రైక్ రేటుతో 96 రన్స్ కొట్టింది.
టీ 20 సిరీస్‌లో దుమ్మురేపిన భారత మహిళల జట్టు తొలి వన్డేలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ మొదలవుతుందనగా వర్షం పడింది. దాంతో, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు ప్రియా పూనియా(10), స్మృతి మంధాన(11) విఫలమయ్యారు.
హర్మన్‌ప్రీత్ కౌర్(5), మురుఫా అక్తర్(6)
టీ 20 సిరీస్‌లో రాణించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(5), జెమీమా రోడ్రిగ్స్(10) తక్కువకే ఔటయ్యారు. చివర్లో దీప్తి శర్మ(20), అమన్‌జోత్ కౌర్(15) పోరాడినా గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్ మురుఫా అక్తర్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టింది. దేవికా వైద్య(10) ఔటవ్వడంతో భారత్ 132 పరుగులకే పరిమితమైంది. దాంతో, ఆతిథ్య బంగ్లా 40 పరుగులతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కీలకమైన రెండో వన్డే జూలై 19న జరుగనుంది.