ODI World Cup 2023 : పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్(ODI World Cup 2023) కోసం భారత్‌కు బయలుదేరింది. బాబర్ ఆజాం(Babar Azam) నేతృత్వంలోని పాక్ బృందం రేపు హైదరాబాద్(Hyderabad)లో అడుగుపెట్టనుంది. అయితే.. ఇండియా ఫ్లైట్ ఎక్కేముందు బాబర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు లక్ష్యం ఈసారి వరల్డ్ కప్ గెలవడమే అని, నాలుగో స్థానం కోసం ఆడడానికి భారత్‌కు వెళ్లడం లేదని బాబర్ అన్నాడు.
‘ప్రపంచ కప్ పోటీలకు వెళ్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంతకుముందు ఇండియాలో మేము ఆడలేదు. అలాగని ఒత్తిడికి లోనవ్వడం లేదు. భారత పిచ్‌లపై మేము రీసెర్చ్ చేశాడు. శ్రీలంక(Srilanka)లో మాదిరిగానే ఇక్కడి పరిస్థితులు ఉంటాయని విన్నాం. టాప్ 4లో ఉండం మా లక్ష్యం కాదు. విజేతలుగా నిలవడానికే భారత్ వెళ్తున్నాం. ప్రపంచ కప్ ముందు మేము చాలా మ్యాచ్‌లు ఆడాం. ఆసియా కప్ తర్వాత కొందరికి విశ్రాంతినిచ్చాం. వాళ్లు ఇప్పుడు గెలవాలనే కసితో ఉన్నారు. ట్రోఫీతో తిరిగి వెళ్తామనే నమ్ముతున్నా’ అని బాబర్ వెల్లడించాడు.
మెగా టోర్నీలో కెప్టెన్‌గా ఆడుతున్నందుకు ఒకింత గర్వంగా అనిపిస్తోందని బాబర్ చెప్పాడు. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలు ఉన్నాయనే వార్తల్ని పాక్ సారథి కొట్టిపారేశాడు. కెప్టెన్‌గా బాబర్‌కు ఇదే మొదటి భారత పర్యటన కావడం విశేషం. పాక్ జట్టు ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 28న న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్(Warm up Match) ఆడనుంది. అనంతరం 30న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
అక్టోబర్ 5న ప్రపంచ కప్ సంగ్రామం షురూ కానుంది. అక్టోబర్ 14న దాయాదులు భారత్, పాకిస్థాన్ అహ్మదాబాద్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా చేతిలో బాబర్ సేన చావు దెబ్బ తిన్నది. 357 పరుగుల ఛేదనలో 218 రన్స్‌కే కుప్పకూలింది. దాంతో, వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థుల్లో ఎవరు గెలుస్తారు? అనేది కోట్లాది మంది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.