నింగ్బొ (చైనా) : బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో మూడో రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. రెండో రోజు ఏకపక్ష విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరిన సింగిల్స్ షట్లర్లలో యువ సంచలనం ఆయుష్ శెట్టి మినహా మిగిలినవారంతా రెండో రౌండ్‌కే ఇంటిబాట పట్టారు. హెచ్ఎస్ ప్రణయ్, పీవీ సింధు, ఉన్నతి హుడా నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఆయుష్.. 21-16, 21-12తో తనకంటే మెరుగైన ర్యాంకు (20) కల్గిన చైనీస్ తైపీ షట్లర్ చియు జెన్ను ఓడించాడు.భుజం గాయం నుంచి కోలుకుని ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన ప్రణయ్.. 12-21, 19-21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో అపజయం పాలయ్యాడు.
రెండుసార్లు ఒలింపిక్ విజేత సింధు.. 18-21, 8-21తో రెండో సీడ్ వాంగ్ జియి (చైనా) జోరు ముందు నిలువలేకపోయింది. ఉన్నతి హుడా 17-21, 9-21తో మియజకి (జపాన్) చేతిలో చిత్తైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ధృవ్ కపిల, తనీషా క్రాస్టొ జంట 13-21, 14-21తో నాలుగో సీడ్ మలేషియా జోడీ చెంగ్ టాంగ్ జీ, తొ ఈ వీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో ప్రియా, శృతి కూడా రెండో రౌండ్‌కే నిష్క్రమించారు.