లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా తనకు అచ్చొచ్చిన ‘స్లెడ్జింగ్’నే నమ్ముకున్నది. ఈ విషయాన్ని స్వయంగా సఫారీ సారథి బవుమానే వెల్లడించాడు. మార్క్మ్-్రబవుమా జోడీ దక్షిణాఫ్రికా విజయాన్ని ఖరారు చేస్తున్న సమయంలో ఇక చేసేదేమీ లేక కంగారూలు తమకు వెన్నెతో పెట్టిన విద్య అయిన స్లెడ్జింగ్‌కు దిగారని అతడు ఆరోపించాడు.
మ్యాచ్ అనంతరం బవుమా మాట్లాడుతూ.. ‘మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ భయంకరమైన పదాన్ని (చోకర్స్) విన్నాం. మేం ఇక్కడికి (లార్డ్స్‌కు) ఎంతో నమ్మకంతో వచ్చాం. మాపై ఎన్నో సందేహాలు. కానీ మా ఆటతీరు, ఈ గెలుపు వాటన్నంటినీ పటాపంచలు చేసింది. ఇది మా దేశానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తున్నా’ అని అన్నాడు.
దక్షిణాఫ్రికా సారథిగా ఉండటం అత్యంత సవాల్‌తో కూడుకున్నదని అతడు అన్నాడు. ‘దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా ఉండటం అంత సులభం కాదు. ఎన్నో త్యాగాలు, ఎంతో నిరాశ అలుముకున్న సందర్భంలో మేం ఐసీసీ ట్రోఫీ గెలవడానికి అర్హులమని అనిపించింది’ అని తెలిపాడు. ఈ విజయంతో తాను జట్టులో ఒక నల్లజాతి క్రికెటర్‌గానే కాకుండా అంతకుమించిన గుర్తింపును దక్కించుకున్నానని బవుమా భావోద్వేగంగా మాట్లాడాడు.