రావల్పిండి: చాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య రసవత్తర సమరానికి తెరలేవనుంది. టోర్నీలో అంచనాలే లేకుండా బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై రికార్డు ఛేదన (356)ను దంచేసిన ఆస్ట్రేలియా.. రావల్పిండిలో దక్షిణాఫ్రికాను ఢీకొననుంది. తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. అఫ్గానిస్థాన్‌పై అలవోక విజయం సాధించిన జోష్‌లో ఉంది. కాగా మంగళవారం మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ బెర్తును ఖాయం చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో ఈ పోరు ఉత్కంఠగా సాగడం ఖాయం! ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్లు షార్ట్, ఇంగ్లిస్, లబూషేన్, మ్యాక్స్‌వెల్.. సఫారీ పేసర్లు రబాడా, ఎంగిడి, జాన్సెన్ను ఏ మేరకు ఎదుర్కుంటారనేది ఆసక్తికరం. ఇక సఫారీ బౌలింగ్ యూనిట్‌తో పోలిస్తే కాస్త బలహీనంగా కనిపిస్తున్నా ఆసీస్.. దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఎలా నియంత్రిస్తుందో చూడాలి.