Border – Gavaskar Trophy : భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy 2024-25)పై అందరి కళ్లన్నీ నిలిచాయి. ప్రపంచంలోని మేటి జట్ల పోటీపడే ఈ సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం అంటున్నారు క్రీడా పండితులు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం జెఫ్ లాసన్(Jeoff Lawson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 21వ శతాబ్దంలోనే అత్తుత్తమ సిరీస్‌గా నిలుస్తుందని మాజీ పేసర్ అయిన లాసన్ అభిప్రాయపడ్డాడు.
‘ఆస్ట్రేలియాలో వేసవి వేడి మొదలవుతున్న సమయంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ జరుగనుంది. ఇరుజట్లలో దంచికొట్టగల బ్యాటర్లు ఉన్నందున ఒక్క మ్యాచ్ కూడా డ్రా అవుతందని నేను అనుకోవడం లేదు. ఈ ట్రోఫీ కచ్చితంగా 21వ శతాబ్దపు అత్తుత్తమ టెస్టు సిరీస్ అవుతుందని నా నమ్మకం. దాంతో, క్రికెట్లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సిరీస్ మళ్లీ మనకు గుర్తు చేస్తుంది’ అని లాసన్ వెల్లడించాడు.
ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు మ్యాచ్‌లుగా జరుగనుంది. 1972 తర్వాత ఇరుజట్లు ఐదు టెస్టుల సిరీస్ ఆడడం ఇదే తొలిసారి. ఈ ఏడాది నవంబర్ 22న తొలి టెస్టు మొదలవ్వనుండగా.. ట్రోఫీ జనవరి 7 వరకూ జరగనుంది. టీమిండియా చేతిలో మూడుసార్లు ఓడిన ఆసీస్ ఈసారి బీజీటీ ట్రోఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అయితే.. ఈసారి భారత జట్టు విజయావకాశాలు యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మీదే అధారపడి ఉన్నాయని పలువురు ఆసీస్ క్రికెటర్లు అంటున్నారు. దూకుడుకు కేరాఫ్ అయిన యశస్వీ కంగారూల గడ్డపై తన తొలి అడుగును ఎలా వేస్తోడో, ఏం చేస్తాడో చూడాలి మరి.