Aus vs Ind | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం భారత మహిళల జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లండన్ వేదికగా ఆదివారం జరగనున్న గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఆరు సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది.ప్రస్తుతం గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు 6 పాయింట్లతో ఉన్నాయి. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో పోటీలో ఉన్నప్పటికీ, సెమీఫైనల్ అవకాశాలు చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం తొలుత లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక పోరు జరగనుంది. దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్‌కు గత రికార్డు అంత అనుకూలంగా లేకపోవడంతో ప్రొటీస్ జట్టు గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అలాంటి పరిస్థితిలో భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఓటమి పాలైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఎదురవుతుంది. ఇక ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 8 పాయింట్లు, 4.724 నెట్ రన్‌రేట్‌తో సెమీస్‌కు దాదాపు అర్హత సాధించింది. భారత్ చేతిలో ఓడినా వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే బంగ్లాదేశ్ అనూహ్యంగా దక్షిణాఫ్రికాను ఓడిస్తే భారత్‌కు నెట్ రన్‌రేట్ పరంగా అవకాశం లభించే పరిస్థితి ఏర్పడొచ్చు. టోర్నీ ఆరంభంలో భారత ఓపెనర్ల ఫామ్ ఆందోళన కలిగించినా, స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు కీలక ఇన్నింగ్స్‌లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. స్మృతి ఇప్పటివరకు 167 పరుగులు చేయగా, షెఫాలీ 145 పరుగులతో ఆకట్టుకుంది. అయితే మిడిల్ ఆర్డర్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్‌ల నుంచి మంచి ప్రదర్శనలు రాకపోవడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. కీలక సమయంలో ఈ ఇద్దరు బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఫీల్డింగ్ కూడా భారత జట్టుకు పెద్ద సమస్యగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత ఫీల్డర్లు మొత్తం ఆరు సులభ క్యాచ్‌లను వదిలేయడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ తప్పిదాలే ఓటమికి కారణమయ్యాయి.రాధా యాదవ్ వంటి అనుభవజ్ఞురాలు కూడా కీలక క్యాచ్‌లను వదలడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై చిన్న పొరపాట్లకు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కోచ్ అమోల్ ముజుందార్ జట్టును హెచ్చరించినట్లు తెలుస్తోంది. బౌలింగ్ విభాగంలో ఎడమచేతి స్పిన్నర్ శ్రీ చరణి భారత జట్టుకు ప్రధాన బలంగా నిలిచింది. టోర్నీలో ఇప్పటివరకు 12 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో ఉన్న ఆమెపై మరోసారి భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. గాయంతో దూరమైన స్టార్ ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ తిరిగి జట్టులోకి రావడం కంగారూలకు అదనపు బలాన్ని అందిస్తోంది. గతంలో ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ చరిత్ర సృష్టించిన జ్ఞాపకాలు ప్రస్తుతం జట్టుకు స్ఫూర్తినిస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చింది.ఇప్పుడు మరోసారి అదే ప్రత్యర్థిపై గెలిచి సెమీస్ చేరాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. అభిమానులంతా కూడా ఈ కీలక పోరులో హర్మన్‌ప్రీత్ సేన విజయాన్ని ఆశిస్తున్నారు.