Asia Cup | పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆసియాకప్‌లో పాల్గొంటుందని తాను భావించడం లేదని గవాస్కర్ అన్నారు. ఈ ఏడాది ఆసియాకప్‌కు భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.కానీ పహల్గాం దాడి తర్వాత, టోర్నమెంట్ జరగడం, పాకిస్తాన్ దానిలో పాల్గొనడంపై సందేహం మారింది. ఓ స్పోర్ట్స్ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) వైఖరి భారత ప్రభుత్వం వైఖరిలాగే ఉంటుందని గవాస్కర్ స్పష్టం చేశారు. భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి అలాగే ఉంటే పాకిస్తాన్ ఈ టోర్నమెంట్లో ఆడబోదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వం వారికి చెప్పేదే.. బీసీసీఐ వైఖరి అని అన్నారు. ఆసియా కప్ విషయంలో ఎటువంటి మార్పు ఉండదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక ఆసియా కప్ ఎడిషన్‌కు భారతదేశం-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయని.. కాబట్టి పరిస్థితులు ఏమైనా మారతాయా ? లేదా? అన్నదానిపై ఆధారపడి ఉంటుందని.. పరిస్థితి మారకపోతే పాకిస్తాన్ ఇకపై ఆసియా కప్‌లో భాగం కాబోదని భావిస్తున్నట్లు చెప్పారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) రద్దు చేయవచ్చని.. పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. భారత్ టోర్నీ నుంచి వైదొలగితే ఏసీసీ రద్దవుతుందని.. లేదంటే ఆసియా కప్ మూడు నాలుగు దేశాల టోర్నమెంట్‌గా కుదించేందుకు ఆస్కారం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అది ఎలా జరుగుతుందో తనకు తెలియదన్నారు. అది మూడు దేశాల టోర్నమెంట్ కావొచ్చని.. లేదంటే హాంకాంగ్, యూఏఈ.. ఆహ్వానించిన నాలుగు దేశాల టోర్నీ జరగొచ్చన్నారు.
రాబోయే కొద్ది నెలల్లో ఏం జరుగుతుందో.. అప్పటి పరిస్థితులపై అంతా ఆధారపడి ఉంటుందన్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి భారతదేశం వైదొలగాలని నిర్ణయించుకునే అవకాశం ఉందని.. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు నాలుగు దేశాల టోర్నీ, లేకపోతే ఐదు దేశాల టోర్నమెంట్ నిర్వహిస్తారని చెప్పొచ్చన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరుగనున్నది. ఈ జట్టులో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఈ సారి టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక, పాక్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ టోర్నీలో హాంకాంగ్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్ ఆడుతాయి. టోర్నీ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. టోర్నీ ఫార్మాట్ గతం కంటే భిన్నంగా ఉండనున్నది. ఎనిమిది జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఇందులో నుంచి ఓ జట్టు సూపర్ఫోర్కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో టాప్‌లో నిలిచిన రెండు జట్లు ఆసియా కప్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతాయి.