దుబాయ్ : ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరిస్థితి. ఈనెల 14న భారత్‌తో మ్యాచ్ ముగిశాక టీమ్ఇండియా ఆటగాళ్లు తమతో చేతులు కలపలేదని నానా యాగీ చేసి ఐసీసీ వద్ద అబాసుపాలైన పాకిస్థాన్ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. పాక్‌తో మ్యాచ్ అయ్యాక సూర్య మాట్లాడిన ప్రసంగంపై అభ్యంతరం తెలిపింది. పాక్‌పై గెలిచాక సూర్య మాట్లాడుతూ.. ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు అంకితమిస్తున్నామని, పాకిస్తాన్‌కు సరైన సమాధానమిచ్చామని అన్నాడు.
అంతేగాక ఆపరేషన్ సింధూర్‌లో భారత సైనిక బలగాల కృషినీ కొనియాడాడు. దీనిపైనే పాక్ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సూర్య మాటలు రాజకీయ ప్రేరేపితంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని వాపోతున్నది. గ్రూప్ దశలో తలపడిన భారత్, పాక్.. సూపర్-4లోనూ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో పీసీబీ ఈ రాద్ధాంతానికి తెరలేపడం గమనార్హం.