R Ashwin : ఇంగ్లండ్ పర్యటనకు సమయం దగ్గర పడుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌కు ఇంకా 15 రోజులు ఉన్నాయంతే. అయినా సరే భారత జట్టు టెస్టు సారథి ఎవరనేది? ఇంకా కొలిక్కి రావడం లేదు. శుభ్‌మన్ గిల్ (Shumban Gill) పగ్గాలు చేపట్టడం లాంఛనమే అని తెలిసినా.. సీనియర్లుకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను కెప్టెన్‌గా ఎంచుకోవాలని సునీల్ గవాస్కర్ సహ పలువురు మాజీలు బీసీసీఐకి సూచిస్తున్నారు. బుమ్రా మాత్రమే కాదు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు సైతం అర్హత ఉందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) అంటున్నాడు.
రోహిత్ శర్మ వీడ్కోలుతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యం అయింది. సీనియర్ విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టు సారథిగా ఉండేందుకు ఆసక్తి చూపించినా.. బీసీసీఐ, సెలెక్టర్లు తిరస్కరించడంతో అతడూ అల్విదా పలికాడు. దాంతో, హిట్‌మ్యాన్ వారసుడిగా శుభ్‌మన్ గిల్ పేరును సూచిస్తున్నారు కొందరు. అయితే.. సుదీర్ఘ ఫార్మాట్లో పెద్దగా అనుభవం లేని గిల్‌కు నాయకత్వం అప్పగించడం సరికాదని అశ్విన్ అభిప్రాయ పడుతున్నాడు. ‘ప్రస్తుతం చాలామంది టెస్టు కెప్టెన్‌గా గిల్‌కు మద్దతు పలుకుతున్నారు.
Ravi Ashwin said, “everyone is saying that Shubman Gill is the Test captain. Everyone is going in that direction. But there is a loud option in Jasprit Bumrah, and why do we forget about Ravindra Jadeja”. pic.twitter.com/ditTjA9YPG
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 16, 2025
కానీ, అతడు మాత్రమే కాదు జట్టులోని సీనియర్లను కూడా పరిగణించాలిగా. బుమ్రా, జడేజాలకు ఈ ఫార్మాట్లో సుదీర్ఘ అనుభవం ఉంది. వీళ్లలో ఒకరిని సారథిగా ప్రకటించడం మంచిది. ఎందుకంటే.. కొత్త కుర్రాడికి బాధ్యతలు ఇచ్చేముందు అతడు అన్నివిధాలా సమర్ధుడేనా అని ఆలోచించాలి. గాయాల సాకుతో బుమ్రాకు కెప్టెన్సీ దూరం చేయాలనుకోండం సరైంది కాదు.
వెన్ను నొప్పితో బాధపడుతున్న ప్యాట్ కమిన్స్ (Pat Cummins) వన్డే, టెస్టుల్లో ఆస్ట్రేలియా సారథిగా కొనసాగుతున్నాడు. అలాంటప్పుడు బుమ్రాను నాయకుడిని చేయడంలో సందేహం అనవసరం. అందుకే.. ఈ ఇద్దరిలో ఒకరిని రెండేళ్ల పాటు కెప్టెన్‌గా, శుభ్‌మన్‌ను డిప్యూటీగా కొనసాగించాలి. అ సమయంలో అతడు జట్టును ఎలా నడపాలో నేర్చుకుంటాడు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు.
డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌ను కొత్త కెప్టెన్‌తో మొదలు పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ నూరు మార్కులు కొట్టేశాడని.. యువకుడైన అతడిని నాయకుడిగా చేయడానికి ఇదే మంచి తరుణం అని కోచ్ గంభీర్ (Gautam Gambhir) సహా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అనుకుంటున్నారు. సో.. ఇంగ్లండ్ సిరీస్‌కు స్క్వాడ్ ప్రకటన రోజే కొత్త కెప్టెన్ పేరును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.