Nizamabad | వినాయక నగర్, మే,16: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుండగులు కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు తాళం వేసిన ఇండ్లు, గుడులు, వ్యాపార సముదాయాలలో దొంగతనాలకు పాల్పడిన దుండగులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎవరికి అనుమానం కలగకుండా మూగజీవాలను దొంగిలించుకుపోయేందుకు పథకం పన్నారు.
గురువారం అర్ధరాత్రి అనంతరం మూగజీవాలకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చోరీ చేసేందుకు యత్నించిన ముఠా స్థానికులు మేలుకోవడంతో పరారైంది. నిజామాబాద్ నగరంలోని నెల్కల్ రోడ్డు పరిధిలో రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న గాయత్రీ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారి జామున 3.30 గంటల సమయంలో ఓ కార్లో వచ్చిన ముఠా రోడ్డుపై పడుకుని ఉన్న ఆవు, గేదెలకు మత్తు ఇంజక్షన్ లు ఇచ్చారు. దీంతో ఆ మూగ జీవాలు స్పృహ కోల్పోయాయి.
వాటిని కారులో వేసుకొని పరారయ్యేందుకు యత్నిస్తుండగా, అలికిడికి కాలనీవాసులు మేల్కొని గట్టిగా అరవడంతో మూగజీవాలను దొంగిలించేందుకు యత్నించిన ముఠా సభ్యులు కారులో పరారయ్యారు. ఈ విషయాన్ని సంబంధిత నాలుగో టౌన్ పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని తెల్లవారుజామున జరిగిన మూగజీవాల చోరీ ఘటనపై ఆరా తీశారు.
అయితే కారులో వచ్చి చోరీకి ఎత్నించి పారిపోయిన దుండగులను గుర్తించేందుకు పరిసరాల ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.