England Squad అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో సూపర్ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. సిరీస్‌లో తమ జోరు కొనసాగించాలనుకుంటున్న బెన్ స్టోక్స్ బృందం పేస్ బలాన్ని మరింత పెంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగబోయే తదుపరి టెస్టు కోసం డేంజరస్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer)ను తీసుకుంది. తద్వారా లీడ్స్ టెస్టులో అనుభవలేమితో భారత బ్యాటర్లకు కళ్లెం వేయలేకపోయిన బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత దేశం తరఫున ఆర్చర్ వైట్ జెర్సీ వేసుకోబోతున్నాడు.
తొలి టెస్టులో టీమిండియాపై రికార్డు ఛేదనతో విజయం సాధించిన ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో విక్టరీతో సిరీస్‌లో తమ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది స్టోక్స్ సేన. దాంతో, గురువారం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన తుది స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. ఇందులో 2019 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్చర్‌కు చోటు లభించింది.
Jofra Archer is 𝑩𝑨𝑪𝑲 🔥
Our squad to take on India in the second Test has just dropped 📋👇
— England Cricket (@englandcricket) June 26, 2025
ఈమధ్యే సస్సెక్స్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ఈ పేస్ గన్.. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. దాంతో, జూలై 2న మొదలయ్యే హెడ్జ్బాస్టన్ టెస్టు కోసం అతడిని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. 2021 ఫిబ్రవరిలో చివరిసారిగా టెస్టు జెర్సీ వేసుకున్న ఆర్చర్.. పునరాగమనంలో భారత బ్యాటర్లను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
రెండో టెస్టుకు ఇంగ్లండ్ స్క్వాడ్ : బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ జో రూట్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, సామ్ కుక్, షోయబ్ బషీర్.
Jofra’s back! 🙌
After making his return to first-class cricket for Sussex, he’s back in England’s squad for the Edgbaston Test starting next week 🏴 pic.twitter.com/Mr1VYyrCFM
— ESPNcricinfo (@ESPNcricinfo) June 26, 2025
ఇంగ్లండ్ పర్యటనలో సీనియర్లు కోహ్లీ, రోహిత్ లేకున్నా కుర్రాళ్లు పరుగుల వరద పారించినా.. బౌలర్లు భరోసా ఇవ్వలేకపోయారు. పేలవ ఫీల్డింగ్ కూడా మ్యాచ్ చేజారడానికి ఓ కారణమైంది. హెడింగ్లే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు బౌలర్లుకు చుక్కలు చూపెడుతూ కెప్టెన్ గిల్, పంత్, యశస్వీల సెంచరీలతో విరుచుకుపడగా 471 రన్స్ చేసింది టీమిండియా. అనంతరం బుమ్రా(5-68) ధాటికి ఇంగ్లండ్ 465కు కుప్పకూలింది. 6 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. కేఎల్ రాహుల్, పంత్‌ల విధ్వంసక శతకాలతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. కానీ, టెయిలెండర్ల వైఫల్యంతో 31 పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేతుల్లో పెట్టింది.
చివరి రోజు తొలి సెషన్లో బెన్ డకెట్, జాక్ క్రాలే ‘బజ్ బాల్’ ఆటతో చెలరేగగా ఒక్క వికెట్ తీయలేకపోయరు మన పేసర్లు. రెండో సెషన్లోనూ బుమ్రా తేలిపోగా.. ప్రసిధ్, శార్దూల్ రెండేసి వికెట్లు తీసి ఆశలు రేపారు. కానీ, యశస్వీ క్యాచ్ జారవిడవంతో బతికిపోయిన డకెట్ సెంచరీతో గర్జించగా.. జో రూట్, జేమీ స్మిత్ దూకుడుగా ఆడారు దాంతో, స్టోక్స్ బృందం హెడింగ్లేలో 371 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేందించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో, లీడ్స్‌లో సెంచరీలు మనవి.. గెలుపు సంబురం వాళ్లది అయింది.