ACB | బొల్లారం, జూన్ 26 : తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుండే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని ఏజెంట్లు చేస్తున్న దందాను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్లపై పక్కా నిఘా ఉంచిన ఏసీబీ బృందాలు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఏజెంట్ల నుండి నగదు, పలు వాహన ధ్రువీకరణ పత్రాలు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు దొరికాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఏజెంట్ల ఫోన్లను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీవో సిబ్బందిపై కూడా పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని కూడా విచారిస్తామని అన్నారు. ఆర్టీవోను కూడా అన్ని కోణాలలో విచారించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఒక్కో ఏజెంట్ దగ్గర 50 వాహన దృవీకరణ పత్రాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.