పాలకుర్తి రూరల్ : వ్యవసాయ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలి అని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రురు, పెద్దవంగర, రాయపర్తి, మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సమస్యలు, హామీ ధరల అమలు, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలాలే. ఇక్కడి రైతులు కాలానికి అనుగుణంగా సాగు పద్దతులను అవలంబిస్తున్నారు. అందుకే వారికి కావాల్సిన వనరులు, సూచనలు, తగిన మద్దతు సరైన సమయంలో అందించాలి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు అందుబాటులో ఉండాలన్నారు. అధికారుల భాగస్వామ్యంతోనే రైతుల ఆకాంక్షలు నెరవేర్చగలమన్నారు.