పాల్వంచ, జూన్ 26 : మత్తుకు అలవాటు పడితే వ్యక్తి జీవితం చిన్నాభిన్నమౌతుందని, భవిష్యత్ నాశనమవుతుందని పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణంలో విద్యార్థులతో కలిసి పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడారు. మాదక ద్రవ్యాలను ఒకసారి అలవాటు చేసుకుంటే దాన్ని విడిచి పెట్టడం కష్టమన్నారు. మాదక ద్రవ్యాలను వినియోగించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తి ఆ వ్యక్తి జీవితం అంధకారం అవుతుందన్నారు.
మాదక ద్రవ్యాలపై విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో తమ పక్కన తిరిగే ఒకరిద్దరూ ఇలాంటి చర్యలకు పాల్పడితే వాళ్లకి దూరంగా ఉంటూ వారిని మార్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ తాసీల్దార్ ప్రసాద్, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సిఐ ప్రసాద్ రావు, పాల్వంచ సీఐ సతీశ్, పట్టణ ఎస్ఐ సుమన్, అదనపు ఎస్ఐలు జీవన్, కళ్యాణి, దేవ్ సింగ్ పాల్గొన్నారు.