Angelo Mathews : శ్రీలంక మాజీ కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ (Angelo Mathews) త్వరలోనే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్(Bangladesh)తో జరుగబోయే తొలి టెస్టు అతడికి చివరి మ్యాచ్ కానుంది. రిటైర్మెంట్ వార్తను ఇప్పటికే ప్రకటించిన మాథ్యూస్ .. తన కెరియర్లోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కెప్టెన్సీ సమయంలోనే తన జుట్టు ఎక్కువగా ఊడిపోయిందని చెప్పాడీ ఆల్‌రౌండర్.
‘కెప్టెన్సీ చేపట్టిన తర్వాత నా జట్టు చాలా పోయింది. నేను ఒక్కడినే కాదు లంకకు సారథ్యం వహించిన పలువురు ఆటగాళ్లకు కూడా పెద్దగా జట్టు లేదు. ఎందుకంటే.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం వేరు. జట్టును నడిపించడం వేరు. ప్రతిసారి అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిఒక్కరు మనల్నే గమనిస్తారు. టీమ్ గెలిచినా, ఓడినా మనం ఏం చెబుతామో వినాలని కోట్లాది మంది ఎదురుచూస్తారు. అందుకు.. అప్పుడప్పుడు ఒత్తిడిగా అనిపిస్తుంది. అయినా.. నేను ఆ సవాళ్లతో కూడిన ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు అవకాశం లభించింది. జట్టును మరొక స్థాయికి తీసుకువెళ్లాలి’ అనే లక్ష్యంతో పని చేశాను అని మాథ్యూస్ వెల్లడించాడు.
బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా లంక జట్టులోకి వచ్చిన మాథ్యూస్ 2013లో టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 25 ఏళ్లకు పగ్గాలు అందుకున్న అతడు పిన్నవయస్కుడైన సారథిగా రికార్డు నెలకొల్పాడు. మాథ్యూస్ నేతృత్వంలోని లంక విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించింది. 2014లో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజేతగా నిలిచింది. అనంతరం వన్డే, టీ20 సారథిగానూ సేవలందించాడు మాథ్యూస్. అయితే.. 2017 జింబాబ్వే చేతిలో వన్డే సిరీస్ ఓటమితో అతడు మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలిగాడు.
జూన్ 17న గాలేలో జరుగబోయే మ్యాచ్ ఈ లెజెండరీ ఆల్‌రౌండర్‌కు 119వది. ఇందులో 34 టెస్టులకు అతడు సారథిగా వ్యవహరించాడు. ప్రస్తుతం శ్రీలంక తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మాథ్యూస్ మూడో స్థానంలో ఉన్నాడు. మాజీ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనేలు అతడికంటే ముందున్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో మాథ్యూస్ ఖాతాలో 8,167 రన్స్ ఉన్నాయి. 16 సెంచరీలు బాదిన అతడి అత్యధిక స్కోర్.. 200 నాటౌట్. బంతితోనూ చెలరేగుతూ 33 వికెట్లు పడగొట్టాడీ వెటరన్ ప్లేయర్.