అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఆరోపిస్తూ కూటమి మోసాలపై వెన్నుపోటు ( Vennupotu ) అనే పుస్తకాన్ని వైసీపీ( YCP ) ఆదివారం ఆవిష్కరించింది. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీ బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కేకే రాజు, గణేష్కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనవైఫల్యాలను , మోసాలను ఎండగడుతామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతుందని ఆరోపించారు. వైసీసీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రూ. లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసి ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని పేర్కొన్నారు . పేద ప్రజలను మోసం చేయడంతో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. నాయకులు, అధికారుల తప్పిదం వల్ల ఏపీలో వైసీపీ ఓటమి పాలైందని స్పష్టం చేశారు.