BCCI : మహిళా క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. గత ఏడాది నుంచి నిలకడగా రాణిస్తున్న యువ క్రీడాకారిణులను ప్రోత్సహించేలా ఈసారి వాళ్లకు తగు ప్రాధాన్యమిచ్చింది. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సీనియర్లకు షాకిస్తూ.. ప్రతిభావంతులకు వార్షిక ఫీజు చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
2024-25కు గానూ పలువురు యంగ్‌స్టర్స్‌కు గ్రేడ్ సీ కాంట్రాక్టు ఇచ్చింది బీసీసీఐ . మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుపొందిన యువకెరటం అమన్‌జోత్ కౌర్, టీ20ల్లో పునరాగమనం చేయడంతో పాటు వన్డేల్లోనూ అరంగేట్రం చేసిన హైదరాబాదీ క్రికెటర్ అరుంధతి రెడ్డి, కాంట్రాక్టు సాధించారు.
🚨 News 🚨
BCCI announces annual player retainership 2024-25 – Team India (Senior Women)#TeamIndia pic.twitter.com/fwDpLlm1mT
— BCCI Women (@BCCIWomen) March 24, 2025
టిటస్ సాధు, ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌లు సైతం గ్రేడ్ సీ కాంట్రాక్టు దక్కించుకున్నారు. అయితే.. ఈమధ్యే వన్డేల్లో సెంచరీతో మెరిసిన హర్లీన్ డియోల్‌కు మాత్రం చుక్కెదురైంది. ఆమెతో పాటు మేఘనా సింగ్, దేవికా వైద్య, అంజలీ సర్వానీలకు కూడా కాంట్రాక్టు దక్కలేదు.
బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు 2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. ఊహించినట్టుగానే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు తమ కాంట్రాక్ట్ నిలబెట్టుకున్నారు. గ్రేడ్ ఏలో ఉన్న వీళ్లకు బీసీసీఐ రూ.50 లక్షలు చెల్లించనుంది. ఇక 30 లక్షల విభాగమైన గ్రేడ్ బీలో డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్, పేసర్ రేణుకా ఉన్నారు. గ్రేడ్ సీలో చోటు దక్కించుకున్న అమన్‌జీత్, స్నేహ్ రానా, శ్రేయాంక, రాధా యాదవ్, టిటస్ సాధులు వార్షిక ఫీజు కింద రూ. 10 లక్షలు ఆర్జించనున్నారు.
గ్రేడ్ ఏ – హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ.
గ్రేడ్ బీ – రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్, షఫాలీ వర్మ.
గ్రేడ్ సీ – యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రీ, స్నేహ్ రానా, పూజా వస్త్రాకర్.