జార్జ్‌టౌన్:టీ20 ప్రపంచకప్‌లో అనూహ్య ఫలితాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. పాకిస్థాన్‌కు ఇప్పటికే అమెరికా దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా..కసికూన అఫ్గానిస్థాన్..న్యూజిలాండ్ భరతం పట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గన్ 84 పరుగుల తేడాతో కివీస్‌పై భారీ విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్‌పై అఫ్గన్‌కు ఇది తొలి గెలుపు కావడం విశేషం. దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన అఫ్గానిస్థాన్ గ్రూపు-సీలో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది.
తొలుత ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(56 బంతుల్లో 80, 5ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు ఇబ్ర హీం జద్రాన్(44) రాణించడంతో అఫ్గన్ నిర్ణీత 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది. ముఖ్యంగా గుర్బాజ్..కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. గుర్బాజ్, జద్రాన్ కలిసి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు.
అయితే ఆ తర్వాత వచ్చిన నబీ(0), కెప్టెన్ రషీద్‌ఖాన్(6) నయిబ్(0) స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. బౌల్ట్(2/22), హెన్రీ (2/37) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కివీస్..ఫజుల్లా ఫారుఖి (4/17), రషీద్‌ఖాన్(4/17) విజృంభణతో 15.2 ఓవర్లలోనే కివీస్ 75 పరుగులకు కుప్పకూలింది. ఫిలిప్స్ (18), హెన్రీ(12) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు.